గతంలో టీడీపీ ఆఫీస్ కోసం.. చంద్రబాబు హయాంలో స్థలం కేటాయించడాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు అదే పనిచేశారు. వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం 3 జిల్లాల్లో 55 కోట్ల రూపాయల విలువైన 4.75 ఎకరాల భూములను కేటాయించేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
ఈ జీవో ప్రకారం.. కడప, కోనసీమ, అనకాపల్లి జిల్లాల పరిధిలో అత్యంత విలువైన భూమిని అధికార వైసీపీకి కేటాయించారు. వీటిని అత్యంత కారు చౌకగే వైసీపీ హస్తగతం చేసుకోవడం విశేషం. ఆయా జిల్లాల పరిధిలో జాతీయ రహదారుల వెంబడి ముఖ్య కూడళ్లలో ఈ భూములు ఉన్నాయి. వీటిని 33 సంవత్సరాలపాటు వైసీపీకి లీజుకు ఇచ్చేయడం.. వివాదంగా మారింది. ఏడాదికి ఎకరానికి వెయ్యి చెల్లించాలని ప్రభుత్వమే పేర్కొంది.
కడపలో కేటాయించిన భూమి మార్కెట్ విలువ రూ.30 కోట్లు, అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో 1.75 ఎకరా వైసీపీ కార్యాలయానికి ఇచ్చారు. ఏడాదికి ఎకరానికి వెయ్యి చెల్లించాలని పేర్కొంది. ఈ నెల 20వ తేదీతో జారీ అయిన జీఓలను అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. భూముల కేటాయింపుపై ఒక పక్క విమర్శలు వస్తున్నా వైసీపీ ప్రభుత్వం వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
పేదలకు చాలీచాలకుండా సెంటు, సెంటున్నర స్థలాన్ని మాత్రమే ఇస్తూ పార్టీ భవనాల కోసం ఎకరా లకు ఎకరాలు కేటాయించడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం మాత్రం ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates