టీడీపీ అధినేత Chandrababu వయసుపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ’73 ఏళ్ల ముసలాయన’ అంటూ.. కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు. జోగునాథునిపాలెం వద్ద 9 వందల 86 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జోగినాథునిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.
దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. మన ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు.
విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 5 వందల కోట్ల రూపాయల వ్యయంతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుంది అని CM Jagan చెప్పారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. “73 ఏళ్ల ముసలాయన.. అధికారం కోసం పాకులాడుతున్నార”ని అన్నారు.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు 73 ఏళ్ల ముసలాయన పాకులాడుతుంటే.. ఈయన దత్తపుత్రుడు, దత్త తండ్రిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని.. పరోక్షంగా పవన్‌పైనా కామెంట్లు చేశారు. పవన్‌కు నిర్మాత, దర్శకుడు కూడా చంద్రబాబేనని జగన్ దుయ్యబట్టారు. “ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం” అని జగన్ అన్నారు.
ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోందని, ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుందని అన్నారు. “మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు” అని సీఎం జగన్ మండిపడ్డారు.