ఇరుకు వ్యూహాలు.. క‌ర‌కు నింద‌లు.. అవ‌స‌ర‌మా చంద్ర‌బాబూ!

kandukuru
kandukuru

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఉండాల్సిందే. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై పైచేయి సాధించేందుకు ఎత్తుల‌కు పై ఎత్తులు వేయాల్సిందే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, కొన్నికొన్ని వ్యూహాలు బెడిసి కొడుతుంటాయి. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి టీడీపీలోనూ క‌నిపిస్తోంది. పార్టీ రాజకీయ వ్యూహ‌క‌ర్త ఇచ్చార‌ని చెబుతున్న వ్యూహాన్ని ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్నారు.

అదేంటంటే.. ఇప్ప‌టి నుంచే టీడీపీ పుంజుకుంద‌ని.. ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తున్నార‌నే ప్ర‌చారం చేయ‌డం! ఇది మంచిదే. వ‌స్తున్నార‌ని చెప్పుకోవ‌డం.. వీడియోలు తీసుకుని, ఫొటోలు వేయించుకుంటే ఎవ‌రూ కాద‌న‌రు. ఈ జ‌నాల రాక‌ను చూపించ‌డంలోనే వ్యూహం బెడిసి కొడుతోంది. విజ‌య‌న‌గ‌రంలోను, బొబ్బిలిలోనూ.. చిన్న‌పాటి ఇరుకు సందుల్లో స‌భ‌లు పెట్టార‌నే వాద‌న వ‌చ్చింది.

దీనిని టీడీపీ నాయ‌కులు కూడా అంగీక‌రించారు. అయితే.. పెద్ద గ్రౌండ్స్‌లో అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే.. చిన్న వీధుల్లో మాట్లాడుతున్నామ‌ని అన్నారు. అయితే.. ఈ రెండు చోట్లా ఏమీ కాలేదు కాబ‌ట్టి.. ఓకే! కానీ, ఇప్పుడు Kandukuru లో దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న జ‌రిగింది. ఈ క్ర‌మంలో టీడీపీ వ్యూహం.. బెడిసి కొట్టి.. 8 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో లేనిపోని నింద‌లు ఎదుర్కొనే ప‌రిస్థితి చంద్ర‌బాబుకు ఎదురైంది.

గ‌తంలోనూ చంద్ర‌బాబు ఐదు సార్లు(ఈ 3 ఏళ్ల‌లోనే) Kandukuru లో ప‌ర్య‌టించారు. అప్ప‌ట్లోనూ రెండు సార్లు స‌భ‌లు పెట్టారు. అయితే, ప్ర‌స్తుతం ఘ‌ట‌న జ‌రిగిన ఎన్టీఆర్ స‌ర్కిల్‌కు 200 మీట‌ర్ల దూరంలో ఉన్న అంకమ్మ దేవాలయం ప్రాంగణంలో సభను నిర్వహించేవారు. అది విశాలమైన ప్రాంగణం కావటంతో ఎంత మంది జనం వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ సారి ఇరుకు రోడ్లను ఎంచుకోవటంతో ఊహించని దారుణం జరిగిపోయింది. ఏదేమైనా.. ఇరుకు వ్యూహాల‌తో నింద‌లు ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.