అన్‌స్టాపబుల్ కు పవన్ కల్యాణ్… వైసీపీలో భయం

ఈ మధ్య కాలంలో తెలుగులో సూపర్ డూపర్ హిట్టయిన షో ఏదైనా ఉందంటే అది నిర్ద్వంద్వంగా ‘అన్‌స్టాపబుల్’ అని చెప్పొచ్చు. ఈ షో రెండో సీజన్ చంద్రబాబుతో మొదలై తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా వస్తుండడంతో మరోసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా వైసీపీలో ఈ భయం కనిపిస్తోంది. పవన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు ‘అన్‌స్టాపబుల్’ షోపై మాటల దాడి మొదలుపెట్టడమే దానికి ఉదాహరణ.

అయితే… ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌ రాకుండా కేబుల్ ప్రసారాలలో ఆపించివేసినట్లు అన్‌స్టాపబుల్‌ను ఆపడం సాధ్యం కాక ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. కేబుల్‌లో కాకుండా ఆహా ప్రత్యేకమైన స్ట్రీమింగ్ యాప్ కావడంతో ఆపడానికి వైసీపీ చేతుల్లో ఏమీ లేదు. దీంతో వైసీపీ నేతలు మాటల దాడి ప్రారంభించారు.

ఈ షో‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలయ్య దీన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. గతంలో చంద్రబాబును ఇంటర్వ్యూ చేసి.. ఎన్టీఆర్ వెన్నుపోటు వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేశారని… ఇప్పుడు పవన్‌ను తీసుకొచ్చి కూడా ఆయన తప్పులు సరిచేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. బావాబావమరుదులు చంద్రబాబు, బాలకృష్న ఇద్దరితోనూ పవన్ కల్యాణ్ తిరుగుతున్నారంటూ విమర్శలు చేశారు. బాలకృష్ణ, పవన్‌లది షో మాత్రమేనని.. అంతకుమించి ఇంకేమీ ఉండబోదని పేర్ని నాని అన్నారు.

వైసీపీకే చెందిన మరోనేత, మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ షోపై విమర్శలు ప్రారంభించారు. గతంలో చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడికి పవన్ వెళ్లలేదు కానీ ఇప్పుడు బాలయ్య షోకు వెళ్తున్నారని.. రక్తసంబంధం కంటే ప్యాకేజీ సంబంధమే గొప్పదంటూ ఆయన ట్వీట్ చేశారు.

కాగా పవన్‌తో ఎపిసోడ్ షూటింగ్ మొదలైనట్లు అల్లు అరవింద్ ప్రకటించడంతో పాటు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఇప్పటికే సోసల్ మీడియాలో విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ సీజన్ మొదటి షో‌లో చంద్రబాబు వచ్చి ఎన్టీఆర్ ఎపిసోడ్‌పై క్లారిటీ ఇవ్వడంతో పాటు తనకు ఉన్న గొప్ప స్నేహితుల లిస్ట్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు కూడా చెప్పడంతో అప్పుడే రాజకీయంగా సంచలనంగా మారింది. అలాంటిది ఇప్పుడు పవన్ కూడా అన్‌స్టాపబుల్ వేదికగా తనపై ఉన్న అనేక ఆరోపణలకు జవాబిస్తారని.. రానున్న ఎన్నికల ప్రయాణానికి సంబంధించి క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న పవన్ వ్యాఖ్యల అర్థం వంటి అంశాలపై బాలయ్య ప్రశ్నలు సంధించినట్లు చెప్తున్నారు.

వీటితో పాటు రానున్న ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్న కాపుల ఓటు బ్యాంకును టోటల్‌గా టీడీపీ, జనసేన ఖాతాలో వేసేలా పవన్ ఈ వేదిక నుంచి కీలక వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య, పవన్ అభిమానుల కంటే కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఈ ఎపిసోడ్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.