దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న కీలకమైన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు తీసుకున్న చొరవ యువనేత మిత్రుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసిందని ప్రచారం జరుగుతోంది. దేశంలోని రాజకీయ పార్టీలు, వామపక్ష భావజాలం ఉన్న వారు స్పందిస్తున్న విప్లవ రచయితలం సంఘం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి, ఆయన విడుదల విజ్ఞప్తి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తరుణంలో ఆయన కోసం వైసీపీ సీనియర్ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాసి ఆయన విడుదల కోసం స్పందించాలని కోరారు.
వరవరరావు అనారోగ్యంతో ఉండడం తలుచుకుంటే హృదయం చెమ్మగిల్లుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. 46 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు నేను ఉన్నప్పుడు మనతో పాటు వరవరరావు సహచరుడు అని పేర్కొంటూ 81 సంవత్సరాలు ఉన్న వరవరరావుపై ప్రభుత్వం దయ చూపాలని విజ్ఞప్తి చేశారు. వరవరరావును ఈ స్థితిలో నిర్బంధించడం అవసరమా అని ప్రశ్నించారు. సిద్ధాంత నిబద్ధుడైన వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులైన మీరు సానుభూతితో కాపాడండి అని విజ్ఞప్తి చేశారు.
ముంబై జైలులో 80 ఏళ్ల వరవరరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో.. ఆయనను విడుదల చేయాలనే డిమాండ్ గతంలో తెరమీదకు వచ్చింది. జులై 11వ తేదీన ఆయన నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ రావడం.. ఆయన సరిగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారని.. వారు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత.. చివరకు వరవరరావును ముంబై జైలు నుంచి నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు.
అసలే వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. దీంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది.. ఆయన కరోనా బారినపడడంతో వివిధ వర్గాలు స్పందిస్తున్నాయి. లేఖలు రాస్తున్నాయి. అయితే, తెలంగాణ ఉద్యమం సమయంలో ఒకనాడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి కట్టుగా పనిచేసిన వరవరరావు విడుదల విషయంలో ఇప్పటివరకు గులాబీ దళపతి స్పందించలేదు. తాజాగా పొరుగు రాష్ట్రం, మిత్రపక్ష ఎమ్మెల్యే రాసిన లేఖ నేపథ్యంలో అందరి చూపు తెలంగాణ సీఎంపై పడటం ఖాయమంటున్నారు.