ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన అనేక ఊహాగానాలకు తెరతీస్తోంది. ఇటీవల కొద్దినెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి చుట్టూ జరుగుతున్న చర్చల నేపథ్యంలో జగన్ నేరుగా ప్రధాని మోదీ నుంచే క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో బీజేపీ వైఖరి ఏమిటనేది నేరుగా మోదీ నుంచే జగన్ తెలుసుకోవాలనుకుంటున్నారట.
గత ఎన్నికలకు ముందు ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబును ఆ తరువాత మోదీ దగ్గరకు చేరనివ్వలేదు. కానీ, గత కొన్ని నెలలుగా మోదీ, బీజేపీ నుంచి చంద్రబాబు విషయంలో సాఫ్ట్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. వివిధ సమావేశాల పేరుతో చంద్రబాబును కలుపుకొనే ప్రయత్నాలు చేయడం.. మోదీ ఆయనతో నేరుగా మాట్లాడడం… చంద్రబాబు చేసిన సూచనలను మోదీ మెచ్చుకోవడం వంటివన్నీ రాజకీయ లెక్కలకూ ముడిపెడుతున్నారు విశ్లేషకులు. అటు చంద్రబాబు కూడా ఎలాగైనా బీజేపీతో మళ్లీ కలిసి ఏపీలో జగన్‌ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు.
అదే సమయంలో చంద్రబాబును తెలంగాణలో ఉపయోగించుకుని అక్కడ అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు కూడా వినిపిస్తోంది. ఆ సహయానికి బదులుగానే ఏపీలో చంద్రబాబుకు బీజేపీ అండగా నిలుస్తుందన్న భయం వైసీపీని వెంటాడుతోంది. ఆ క్రమంలోనే బీజేపీ పెద్దలనే కలిసి ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాలని జగన్ తలపోస్తున్నారట. అందుకే తన దిల్లీ పర్యటనలో బుధవారం మోదీని కలవనున్న జగన్ ఈ విషయం కూడా మాట్లాడుతారని వైసీపీలో కీలక నేతలు కొందరు చెబుతున్నారు.
అయితే, ఏపీ అభివృద్ధికి అందాల్సిన నిధులు.. పోలవరం.. విభజన హామీల గురించి మాట్లాడుతారని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కాగా జగన్ మంగళవారం రాత్రి 8.30కి దిల్లీ చేరుకుని అక్కడ జనపథ్ 1లోని తన అధికారిక నివాసంలో బస చేస్తారు. బుధవారం ప్రధానితో భేటీ ఉంటుంది. మరికొందరు బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రులతోనూ జగన్ భేటీ కానున్నారని.. విజయసాయిరెడ్డి అన్ని ఏర్పాట్లూ చేశారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates