అప్పులు కోసం జగన్ ఢిల్లీ టూర్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ప్రధానిమోదీతో భేటీ అవుతారు. మోదీ అప్పాయింట్మెంట్ దొరికిన తర్వాతే జగన్ టూర్ ఖరారైంది. బుధవారం సాయంత్రం అయన మోదీతో సమావేశమవుతారు. జీ -20 సన్నాహక సదస్సుకు వెళ్లినప్పుడు మోదీ అప్పాయింట్ మెంట్ అడిగారు. అప్పుడు కుదరలేరు. ఇప్పుడు జగన్ కు పీఎంఓ అప్పాయింట్ మెంట్ ఇచ్చింది..

ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవు. పరిమితికి మంచి అప్పులు చేశారు. మార్కెట్లో కొత్త అప్పులు పుట్టడం లేదు. ఏపీ సర్కారును రిజర్వ్ బ్యాంక్ పూర్తిగా బిగించేసింది. ఎఫ్ఆర్బీఎం పరిమితి కూడా దాటి పోవడంతో అప్పులు చేయడమెలాగో అర్తం కావడం లేదు. సహజంగా కొత్త అప్పు కావాలంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అవకాశం ఉంది. ఈ లోపు రాష్ట్రాన్ని మూడు నెలలు నెట్టుకురావాలి…

రూ. 20 వేల కోట్లు అప్పులు కావాలి

ఏపీ ప్రభుత్వం నెలవారీ అప్పులు కోసం ప్రయత్నిస్తోంది. జీతాలు, పెన్షన్ల కోసం కనీసం 6 వేల కోట్లు కావాలి. వడ్డీలు కట్టేందుకు డబ్బుల అవసరం . ఇతరత్రా ఖర్చులు కూడా ఉంటాయి. దానితో తాజాగా 20 వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తోంది. మార్చి లోపు 20 వేల కోట్లు అప్పు తీసుకునే వెసులుబాటు కల్పించాలని మోదీని స్పయంగా జగన్ కోరతారు. ఇందుకోసం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రావత్ బృందం ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసింది. వినతిపత్రం రేడీ చేస్తోంది…

పెన్షన్ల పునరుద్ధరణ

ఏపీలో వేలాది మందికి పెన్షన్లు ఆగిపోయాయి, అందులో చాలామంది నిజమైన లబ్ధిదారురలు ఉన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే జరిపి అలాంటి వారిని గుర్తించాలని జగన్ ఆదేశించారు. జగన్ కోరుకున్నట్లుగా వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలంటే ప్రతి నెల అదనంగా 590 కోట్ల రూపాయలు అవసరం. అందుకోసం కూడా అప్పులు చేయాల్సిన అనివార్యత ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి….

జీ-20 సమావేశాలపై సంసిద్ధతపై వివరణ

విశాఖలో జీ-20 సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నారు. దానిపై కూడా మోదీకి జగన్ వివరణ ఇవ్వనున్నారు. మొదటి సమావేశం 2023 ఫిబ్రవరి 3 4 తేదీల్లో జరగనుంది. రెండవ సమావేశం ఏప్రిల్ 24న జరగనుంది వీటి కోసం వేసిన కమిటీల పనితీరును జగన్ ఇటీవలే సమీక్షించారు. దానిపై వివరణ ఇస్తూ…. సమావేశాల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు జగన్ ఢిల్లీ వెళ్తున్నారు..

స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు పిలుస్తారా ?

కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన చేస్తామని జగన్ ఇటీవల ప్రకటించారు. ఆ కార్యక్రమానికి వచ్చి శంకుస్థాపన చేయాలని మోదీని కోరేందుకు కూడా జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. అమరావతి శంకుస్థాపన తర్వాత ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించిందన్న ఆరోపణలున్నాయి. కాస్త మట్టి, నాలుగు రాళ్లు తప్పితే ఇచ్చిందేమీ లేదని విపక్షాలు అంటున్నారు. ఈ నేపథ్యంలో స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు మోదీ వస్తారో…రారో చూడాలి..