కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నా.. జనాల్లో ఇప్పటికీ భయం ఉండట్లేదు. మనకు కరోనా రాదు.. వచ్చినా ఏమవుతుంది అనే ధీమా చాలామందిలో కనిపిస్తోంది. కానీ కరోనా అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపించట్లేదు. కొందరి ఆరోగ్యాల్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రాణాల్ని కూడా హరిస్తోంది.
అలాంటి నష్టం మన కుటుంబంలోనే జరిగితే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. సొసైటీలో పలుకుపడి ఉన్న వ్యక్తులు సైతం కరోనాతో పోరాటంలో ఓడిపోతున్న వైనాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. హైదరాబాద్‌కు చెందిన ఓ ఏఎస్ఐ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
కొన్నిసార్లు కరోనా సోకినప్పటికీ.. పరీక్షల్లో అది నిర్ధారణ కాకపోవడం ప్రమాదకరణ పరిణామంగా కనిపిస్తోంది. ప్రేమ్ కుమార్ అనే ఏఎస్ఐ విషయంలో అదే జరిగింది. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ పరీక్షలు చేస్తే నాలుగుసార్లు నెగెటివ్ వచ్చింది. దీంతో మరీ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఆరోగ్యం క్షీణించ సాగింది.
ఈ నెల 14న ఉదయం పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పడకల్లేవని తెలిసి.. వేరే చోట్ల ప్రయత్నించారు. ఏఎస్ఐ అయినా సరే.. ఆయనకు వేరే ఆసుపత్రుల్లో కూడా బెడ్ దొరకలేదు. దీంతో గాంధీకి తరలించారు. తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ దొరకడంతో అక్కడికి తీసుకెళ్లారు.
కానీ ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూత్రపిండాలు ఫెయిలయ్యాయి. వెంటిలేటర్ పెట్టారు. మళ్లీ పరీక్ష చేసి చికిత్స అందిస్తుండగానే శుక్రవారం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన చనిపోయాక ఫలితం పాజిటివ్ అని తేలింది. ఈ ఉదంతం కరోనాతో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియచెబుతుంది.