ప్రముఖులు ఇప్పుడు ఎలా స్పందించినా..దానివెనుక కారణాలు వెతికేవారు చాలా మంది ఉన్నారు. అదేసమయంలో కారణం లేకుండా.. ఎవరూ కూడా ఏపనీ చేయబోరని కూడా అంటారు కదా! ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సంచలన ప్రకటనపై కూడా ఇలాంటివిశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా చిరు చేసిన ప్రకటన అందరినీ ఆకర్షిస్తోంది.
భవిష్యత్లో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు. ‘ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి? అని ఆలోచించాను. ఇక చాలు. నా కుటుంబసభ్యులు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. భగవంతుడు నాకు అనుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చాడు. దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదు, వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతున్నా’ అని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.
అయితే.. ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వస్తారా.. రారా అనేది పక్కన పెడితే.. ఈ సందర్భంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చిరు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా అభిమానులు అందరూ కూడా పవన్ వెంట నిలబడాలని ఆయన ఇప్పటికే అంతర్గతంగా వారికి ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా.. తాను సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు.
ఇలా చూస్తే.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చినా..ఏపీకి ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా పవన్‌కు లాభిస్తుందని.. ఎన్నికల ముందు చిరు చేసే సామాజిక కార్యక్రమం ఏదైనా కూడా.. పవన్‌కు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates