ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన రాక సందర్భంగా కాస్తంత సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఇంతకూ పవన్ కల్యాణ్ ఆర్టీవో ఆఫీసుకు ఎందుకు వెళ్లినట్లు? అన్నది చూస్తే.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.
తాజాగా ఆయన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు అప్లికేషన్ పెట్టేందుకు ఆయన ఆర్టీవో ఆఫీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు.. తనకు చెందిన ఆరు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ఆయన ఆపీసుకు వచ్చారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వేళకు ఆయనకు స్లాట్ కేటాయించారు. చెప్పిన సమయానికి కాస్తంత ముందుగానే పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు చేరుకున్నారు.
నిజానికి ఉదయమే స్లాట్ ఇచ్చేందుకు రవాణా శాఖా అధికారులు సిద్ధమైనా.. తన కారణంగా ఆఫీసు పరిసరాల్లో ఇబ్బందికర వాతావరణం ఎదురు కాకుండా ఉండేందుకు నాన్ పీక్ సమయంలో వచ్చేందుకు మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు. కేటాయించిన సమయానికి కాస్తంత ముందుగానే వచ్చిన పవన్ కల్యాణ్.. రవాణా శాఖ ఉప కమిషనర్ పాపారావును కలిశారు.
ముందుగా బుక్ చేసుకున్న స్లాట్ లో.. ఆయనకు సంబంధించిన ఆరు వాహనాల్ని అర గంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వాటికి పర్మినెంట్ నెంబర్లను కేటాయించారు. మొత్తం ఆరుకార్లలో ఒకటి మెర్సిడెజ్ బెంజ్ కాగా.. రెండు మహీంద్రా స్కార్పియోలు.. ఒక జీపు.. ఒక టయోటా వెల్ ఫేర్ కారుతో పాటు.. ఒక సరకు రవాణా వాహనం కూడా ఉన్నట్లుగా చెప్పారు. మొత్తం తనకు చెందిన ఆరు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ వాహనాలు అత్యధికం ఏపీలోనూ వినియోగిస్తారని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates