పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడల్లా సీఎం జగన్ తన పాత ఫార్ములాను బయటకు తీస్తున్నారు. జనసేనానిని కాపు నేతలతో తిట్టిస్తున్నారు. ఈ క్రమంలో తన చేతికి మట్టి అంటకుండా… కాపులను తిడుతున్నారన్న చెడ్డపేరు రాకుండా చూసుకోవాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది…
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ …. ఏపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. వైసీపీ సర్కారు గద్దె దిగడం ఖాయమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవడమే తన ధ్యేయమన్నారు. దానితో సత్తెనపల్లి నియోజకవర్గానికే చెందిన కాపు మంత్రి అంబటి రాంబాబు పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ గాడిదలు అని పవన్ అంటే… ఆయన పై అంబటి అదే పదజాలాన్ని వాడారు. చంద్రబాబును గెలిపించటానికి తాను గాడిదలా మోస్తానని అన్నారని, జనసైనికులు కూడా తన లాగే గాడిదలా చంద్రబాబుని గెలిపించే బరువు మోయాలని చెబుతున్నారని ఈ వ్యూహాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని అంబటి హితవు పలికారు.
పవన్ పై పేర్నినాని ఫైర్
గతంలో అనేక పర్యాయాలు మాజీ మంత్రి పేర్ని నాని కూడా జనసేనాని పై నోరు పారేసుకున్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు పవన్ ను తిట్టేందుకే ఆయన ప్రెస్ మీట్లు పెట్టేవారు. అసభ్య పదజాలంతో దూషించే వారు. పైగా మీ వదిన సురేఖమ్మ చెప్పిన మాట వింటే బాగుపడేవాడివని కూడా హితవు పలికేవారు.. ఇలా కాపు మంత్రులంతా పవన్ పై విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్నారు. ఒక సారి వైసీపీలోని 27 మంది కాపు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అప్పుడు పవన్ పై ముకుమ్మడి ఎదురు దాడి చేయాలని నిర్ణయించారు. అందుకు జగన్ ఆదేశించారని కూడా చెప్పుకున్నారు. దాన్ని రోజువారీ అమలు చేస్తున్నారనే చెప్పుకోవాలి…