రాజకీయాల్లో తొడగొట్టడం.. ఇప్పుడు కామన్ అయిపోయింది. గతంలో ఒకింత బలమైన నాయకులు పౌరు షానికి తొడగొట్టిన ఘటనలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆడ లేదు.. మగా లేదు.. మీసం ఉన్నా లేకున్నా మెలేస్తున్నారు.. తగ్గేదేలే అంటూ.. తొడగొడుతున్నారు. ఇలా.. తొడగొట్టిన టీడీపీ యువ నాయకురాలు.. ఇప్పుడు మళ్లీ ఇరకాటంలోనే పడ్డారని అంటున్నారు పార్టీ నేతలు.
ఈ ఏడాది జరిగిన టీడీపీ మహానాడు వేదికగా.. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె, యువ నాయకురాలు గ్రీష్మ తొడగొట్టి మరీ వైసీపీ నాయకులపై విరుచుకుపడిన విషయం..అప్పట్లో రికార్డు స్థాయిలో హల్చల్ చేసింది. దీంతో ఇంకేముంది.. ఆమెకు పార్టీలోనూ.. నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున హారతులు పడతారని అందరూ అనుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు సైతం టికెట్ కన్ఫర్మ్ చేస్తారని భావించారు.
కానీ, అనూహ్యంగా గ్రీష్మ కొట్టిన తొడ చప్పుడు.. మహానాడు వేదికను దాటి పోలేదని.. కాస్తంత లేటుగా అర్ధమైంది. దీంతో ఇప్పుడు మళ్లీ ఆమె పరిస్థితి మొదటికొచ్చిందని అంటున్నారు పరిశీలకులు. విషయం ఏంటేంటే.. శ్రీకాకుళం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం రాజాం. ఇక్కడ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేసి విజయం దక్కించుకోవాలని గ్రీష్మ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇది సాధ్యం కావడం లేదు.
ఎందుకంటే.. మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్.. ఇక్కడ తిష్టవేసుకుని కూర్చున్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన పలుకుడి ఉన్న కోండ్రుకు.. గత ఎన్నికల్లో చంద్రబాబు పిలిచి టికెట్ ఇచ్చారు. అయితే.. వైసీపీ హవాలో ఆయన ఓడిపోయినా.. పార్టీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో చంద్రబాబు మరోసారి ఆయనకే టికెట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు.
ఇదిలావుంటే.. మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి.. దగ్గర బంధువైన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావుతో వివాదాలు ఉన్నాయి. దీంతో కళా వెంకట్రావే.. గ్రీష్మకు అడ్డు తగులుతున్నారనేది భారతి వాదన. అయినప్పటికీ.. భారతి మొర ఆలకించే వారు కనిపించడం లేదు. దీంతో గ్రీష్మ కొట్టిన తొడ చప్పుడు.. సిక్కోలు వరకు వినిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమెకు టికెట్ వచ్చే వరకు సందేహమేనని అంటున్నారు.