నా వారాహిని ఎవడాపుతాడో చూస్తా – పవన్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న వారాహి ప్ర‌చార వాహ‌నంలో త్వ‌ర‌లోనే తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రానున్న‌ట్టుప‌వ‌న్ తెలిపారు. ఈ క్ర‌మంలో త‌న‌ను ఎవ‌రు ఆపుతారో చూస్తాన‌ని స‌వాల్ రువ్వారు. నా వారాహి వాహ‌నంతో ప్ర‌చారానికి వ‌స్తున్నా. న‌న్ను ఎవ‌డు ఆపుతాడో రండి. మీ సీఎంను ర‌మ్మ‌నండి. కూసే గాడిద‌ల‌ను ర‌మ్మ‌నండి. నా వారాహిని ఆప‌మ‌నండి. అప్పుడు చూపిస్తా నేనేంటో!! అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

తాజాగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కౌలు రైతుల‌ను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించారు. ఆత్మ హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు రూ. ల‌క్ష చొప్పున ఆయ‌న సాయం చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని, ప్రజలంతా కోరుకుంటే తాను సీఎం అవుతానన్నారు.

మంత్రి అంబటి రాంబాబుది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఆయన ఒక మంత్రా? అని ప్రశ్నించారు. తనపై బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నాయకులకు సరైన సమాధానం చెబుతానన్నారు. తాను ఏ పార్టీకి కొమ్ముకాయనని, ఏ పార్టీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు పట్టలేదన్నారు. తన సినిమాలు ఆపేసినా భయం లేదన్నారు. వారాహి వాహనం‌లో ఏపీ రోడ్ల‌పై తిరుగుతా.. ఎవరూ ఆపుతారో చూస్తానని స‌వాల్ విసిరారు.