ఏపీలో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న జనసేన.. పెద్ద చేపలు వల విసురుతోందనే వాదన వినిపి స్తోంది. పైకి ఎన్ని విధాలుగా ఆదర్శం ప్రదర్శించాలని అనుకున్నా.. రాజకీయాలు అలా లేవు. ప్రజలు కూడా అలా లేరు(ఇది.. నిజం!). మాకేంటి? అనుకునే వర్గాలు.. మా లాభమేంటి అని భావిస్తున్న ప్రజలు పెరిగిపోతున్నారనేది నిష్టుర సత్యం. ఈ నేపథ్యంలో ప్రజలకు డబ్బులు ఇవ్వకపోయినా.. కనీసం వారిని ప్రభావితం చేసే నాయకులు ఇప్పుడు జనసేనకు అవసరం.
ఈ దిశగానే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నా రు పరిశీలకులు. కీలక నేతలకు పార్టీలో రెడ్ కార్పెట్ పరిచేందుకు ఆయన రెడీ అయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా సమూహాలను ప్రభావితం చేసే నాయకులకు జనసేన ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు. కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేన తీర్థం పుచ్చుకోవడం తథ్యమని అంటున్నారు.
అదేసమయంలో మాజీ డీజీపీ సాంబశివరావు.. కూడా జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఈయన కూడా కాపు వర్గానికి చెందిన వ్యక్తే. రాజకీయాలు కొత్తే అయినా.. ఆయన ప్రభావం కూడా మేదావులపై ఉంటందని జనసేన లెక్కలు కడుతోంది. అదేవిధంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ ను తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇక, ఉభయ గోదావరులు, సీమల్లోని కీలక నేతలను కూడా జనసేన ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. సీమ ను తీసుకుంటే.. బైరెడ్డి రాజశేఖరరెడ్డి సీమ ఉద్యమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన కుమార్తె కూడా రాజకీయాల్లో ఉన్నారు. వీరిని తీసుకోవాలని.. భావిస్తున్న జనసేన.. కీలక పదవిని కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. పార్టీలతో సంబంధం లేకపోయినా.. ప్రజలను ప్రభావితం చేస్తారనే వారిని ఆహ్వానిస్తామని.. ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేయడాన్ని బట్టి.. జనసేన వ్యూహం మారినట్టు కనిపిస్తోంది. మరి ఎంత మంది వస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates