ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల నేతలను తిట్టడానికే మంత్రుల్లో కొందరిని కేటాయించి తరచుగా వారితో ప్రెస్ మీట్లు పెట్టించడం చూస్తూనే ఉన్నాం. తొలి రెండున్నరేళ్లు ఈ బాధ్యతను ప్రధానంగా కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు చూశారు. వారి పదవులు ఊడిపోయాక ప్రతిపక్షాలను అదే పనిగా విమర్శించే బాధ్యతను తీసుకున్న మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్ ఒకరు.
ప్రధానంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తుంటాడు. ఐతే తలాతోకా లేకుండా విమర్శలు చేసి ఈజీగా మీడియాకు, సోషల్ మీడియాకు దొరికిపోవడం అమర్‌నాథ్ స్పెషాలిటీ. గతంలో పవన్‌తో తనే ఫొటో దిగి.. పవన్ వచ్చి తనతో ఫొటో దిగినట్లుగా కలరింగ్ ఇవ్వబోయి అమర్‌నాథ్ ఎలా బుక్కయ్యాడో తెలిసిందే. ఆ ఫొటో దిగింది జనసేన ఆఫీసులో అని తేలడంతో అమర్‌నాథ్ కామెడీ అయిపోయారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి మీద అమర్‌నాథ్ అదే పనిగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఆ వాహన రూపకల్పనలో నిబంధనలు పాటించలేదని, దానికి రిజిస్ట్రేషన్ జరగదని.. వారాహిని ఆంధ్రా రోడ్ల మీద తిరగనివ్వమని వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. కట్ చేస్తే తెలంగాణలో వారాహికి రిజిస్ట్రేషన్ పూర్తయింది. దీంతో వైసీపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఐతే తాజాగా ప్రెస్ మీట్లో దీని గురించి విలేకరులు అమర్‌నాథ్‌ను అడిగితే.. ఆయన తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు.
తెలంగాణలో మోటార్ వెహికల్ రూల్స్ ఎలా ఉన్నాయో తమకు తెలియదని.. ఏపీలో వస్తే మాత్రం ఇక్కడి నిబంధనలకు అనుగుణంగా దానికి బ్రేక్ వేస్తామన్నట్లుగా అమర్‌నాథ్ వ్యాఖ్యానించాడు. కానీ మోటార్ వెహికల్ చట్టం అన్నది దేశం మొత్తానికి ఒకే రకంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విషయంలో ఒకే రకమైన నిబంధనలు పాటిస్తారు. మధ్యలో అమెరికాలో వాహనాలన్నీ కుడివైపు వెళ్తాయి.. ఇక్కడ ఎడమ వైపు అంటూ అమర్‌నాథ్ సంబంధం లేని లాజిక్ కూడా తేవడం గమనార్హం. దేశాల మధ్య పోలిక పెట్టి రాష్ట్రాల మధ్య మోటార్ వెహికల్ నిబంధనలు మారుతాయంటూ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడంతో సోషల్ మీడియాలో ఈయన ఒక మంత్రా అంటూ ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates