సీబీఐ అడిగిన 50 ప్రశ్నలకు కవిత ఆన్సర్లు ఎన్నింటికో తెలుసా?

‘మీ ఇంటికే వస్తాం. మీ వీలు చూసి చెప్పండి’ అని అడిగిన సీబీఐకు అంతే ‘పద్దతి’గా ఎమ్మెల్సీ కవిత సమాధానం ఇవ్వటం.. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఆదివారం సీబీఐ అధికారులు కవిత నివాసానికి వెళ్లటం వరకు ఓకే. కానీ.. ఏకంగా ఏడున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం కురుస్తుందనన అంచనా మాత్రం వేయలేదన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ అన్ని గంటల పాటు సాగిన ప్రశ్నల పరంపరకు కవిత ఎలా రియాక్టు అయ్యారన్నది బయటకు రాలేదు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను నిందితురాలిగా కాకుండా సాక్షిగా విచారిస్తున్న వైనం తెలిసిందే. ఆమె న్యాయవాది సమక్షంలో సీబీఐ డీఐజీ అడిగిన ప్రశ్నలకు కవిత ఆచితూచి అన్నట్లుగా సమాధానాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. దగ్గర దగ్గర నలభై యాభై ప్రశ్నలు సంధిస్తే.. కవిత మాత్రం నాలుగైదింటికి మాత్రమే సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎక్కువ ప్రశ్నలకు తెలీదన్న జవాబే ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

సీబీఐ ప్రశ్నల్లో ఎక్కువగా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు చుట్టూనే తిరిగినట్లుగా చెబుతున్నారు. అన్నింటికి మించి కవిత వాడిన 10 ఫోన్ల అంశంపై ఎక్కువ ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. అన్ని ఫోన్లు ఎందుకు వాడారు? ఎందుకు వాటిని ధ్వంసం చేశారు? లాంటి ప్రశ్నలతో పాటు అమిత్ అరోరా తెలుసా? ఎలా పరిచయం అయ్యింది? ఆయనతో మాట్లాడారా? శరత్ చంద్రారెడ్డి.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి పరిచయం ఎలా? అంటూ వరుస ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది.

కవిత ఎవరెవరితో మాట్లాడారన్న ఆమె సెల్ ఫోన్ కాల్ డేటాను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. చాలావరకు అడిగిన ప్రశ్నలకు.. మరికొన్ని ప్రశ్నల్ని కలిపి ప్రశ్నలుగా మార్చినట్లుగా చెబుతున్నారు. కవితకు సీబీఐ అధికారులు చూపించిన కాల్ డేటా మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాం సమయంలోనే జరిగినట్లుగా చెబుతున్నారు.

మొత్తంగా సీబీఐ ప్రశ్నలు మొత్తం సూటిగా.. ప్రతి ప్రశ్నకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని చూపించినట్లుగా తెలుస్తోంది. ప్రశ్నల పరంపరలో భాగంగా హైదరాబాద్ నుంచి ఢల్లీకి వెళ్లి వచ్చిన ట్రావెల్ హిస్టరీని తమకు ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. అంతా అయ్యాక.. చివర్లో సీబీఐ అధికారులు.. అవసరమైతే మరోసారి ప్రశ్నించాల్సి ఉంటుందన్న మాటను కవితకు చెప్పినట్లుగా చెబుతున్నారు.