ఎన్నికలు ఇంకెంత ఆలస్యం? సామాన్యుడి ఎదురుచూపులు

ప్రభుత్వానికి, పార్టీకి తేడా లేకుండా అయిపోతోంది. ప్రభుత్వాలు పార్టీల నేతృత్వంలోనే ఏర్పడినా పనులు మాత్రం వేరు. పాలిటిక్స్‌ను పార్టీలు చేయాలి… పాలన ప్రభుత్వాలు చేయాలి. పాలన, పాలిటిక్స్ మధ్య ఉన్న విభజన రేఖను పాలక పార్టీలు చెరిపేస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ జాడ్యం మరింత ఎక్కువైపోతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని ప్రశ్నించాల్సిన ప్రజలు కూడా అలాంటి అవకాశం ఏమాత్రం లేకపోవడంతో సర్దుకుపోవడానికి అలవాటుపడిపోతున్నారు.

ఉద్యోగులు ఒకటో తారీఖున జీతం పడకపోయినా పదో తేదీ వరకు వెయిట్ చేస్తున్నారు. డీఏ ఇవ్వకపోయినా ఉద్యోగం ఉంచారు చాల్లే అనుకుంటూ సర్దుకుపోతున్నారు. మండల కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఎందరికి ఎన్ని అర్జీలు ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కాకపోయినా ప్రజలకు కోపం రావడం లేదు. ఇక ప్రజాసంఘాలు ప్రకటనలకు పరిమితమైపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలతోనే అన్నీ అయిపోతాయనుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే గవర్నమెంట్లు చేసే పాలిటిక్సులో అందరూ గిలగిలలాడుతున్నారు.

తెలంగాణలో ఈ తరహా ప్రభుత్వ రాజకీయాలు ఎక్కువైపోతున్నాయన్నది బలంగా వినిపిస్తున్న మాట. పాలిటిక్సులో బిజీగా ఉన్న ప్రభుత్వం పాలన గాలికొదిలేసిందని చెబుతున్నారు. ఎమ్మార్వో ఆఫీసుల నుంచి కలెక్టరాఫీసుల వరకు అన్ని చోట్లా కుప్పలుతెప్పలుగా వస్తున్న ఫిర్యాదులు, అర్జీలే తెలంగాణలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సమస్యలు ఎన్నున్నాయో చెప్పకనే చెబుతున్నాయి.

కలెక్టర్లకు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో పింఛను అందక ఓ వికలాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. పంట నష్ట పరిహారం అందక ఓ రైతు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించాడు.. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరైనా అది మళ్లీ రద్దు కావడంతో ఓ నిరుపేద ఆత్మహత్య చేసుకున్నాడు.

వీరే కాదు.. విద్యార్థులు, నిరుద్యోగులు, వీర్వోలు, ఉపాధ్యాయులు… ఒక్కరేంటి ఎన్నో వర్గాలకు చెందినవారు పాలన రహిత రాష్ట్రంలో ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు పాలిటిక్సుపై పెడుతున్న ఫోకస్ పాలనపై పెడితే ఇలాంటి సమస్యలు తగ్గుతాయన్నది వాస్తవం. అందుకే…. వీలైనంత వేగం ఎన్నికలు పూర్తయి ఏదో ఒక ప్రభుత్వం వస్తే చాలు అనుకుంటున్నారు ప్రజలు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రభుత్వం పాలన మర్చిపోయి రాజకీయమే చేస్తుందని… ఎన్నికలు ముగిస్తే మళ్లీ కొన్నాళ్లు పాలనపై ఫోకస్ పెడుతుందని భావిస్తున్నారు.