తెలంగాణ గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కాం?

తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన పది నిమిషాలకే పేపర్లు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో రేవంత్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో భారీ స్కాం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

గ్రూప్-1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాశారని, డబ్బులకు ర్యాంకులను అమ్ముకున్నారని కొందరు అభ్యర్థులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండు హాల్ టికెట్ నంబర్ల తేడాతో 44 మందికి ఒకేరకంగా మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని, ఆన్సర్ షీట్లను బయటపెట్టాలని సదరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఒక పరీక్షా కేంద్రంలో 563 నుంచి 565 మధ్య హాల్ టికెట్ నెంబర్లు ఉన్నవారికి 348.5 మార్కులు.. 800-803 మధ్య ఉన్నవారికి 351.0 మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

ఇంకో పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్లు 276-278 ఉన్నవారికి 441.0 మార్కులు.. 240-243 మధ్య హాల్ టికెట్ నంబర్లున్నవారికి 430.0 మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.