మరోసారి తన తప్పు ఒప్పుకున్న జగన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. P-4 అంటూ సరికొత్త మోసానికి చంద్రబాబు తెరతీశారని జగన్ ఆరోపించారు. సూపర్-6…లేదు సూపర్-7 లేదని, హామీలు అమలు చేయకుండా తమ తప్పును కప్పిబుచ్చుకునేందుకు ఇలా పీ-4 అంటూ కొత్త కార్యక్రమాలకు తెర తీస్తున్నారని విమర్శలు గుప్పించారు.

హామీల అమలు చేయకపోగా వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాష్ట్రం అప్పుల పాలైందని కుంటి సాకులు చెబుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేందుకే అప్పులపై అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలో వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ తరఫున ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, బెదిరింపులకు దిగినా వైసీపీ మెజారిటీ సీట్లు సాధించిందని, అందుకు కారణమైన పార్టీ కేడర్ కు సెల్యూట్ అని జగన్ అన్నారు. గెలిచేందుకు సరిపడినన్ని స్థానాలు లేకున్నా టీడీపీ దౌర్జన్యంగా గెలిచే ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కుప్పంలో కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించుకున్నారని ఆరోపించారు. 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైసీపీ గెలిచిందన్నారు. పోలీసుల అండతో భయాందోళనలకు గురి చేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ చూసిందని జగన్ ఆరోపించారు. ప్రజల్లో ఎప్పుడూ లేని వ్యతిరేకత కనిపిస్తోందని, హామీల అమలుపై టీడీపీని వారు నిలదీస్తున్నారని చెప్పారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కోవిడ్ తో పాటు పలు కారణాలతో కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోయానని జగన్ అంగీకరించారు. ఇకపై జగన్ 2.0 చూస్తారని, కార్యకర్తలతో మమేకమై వారికి అండగా నిలిచేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నానని జగన్ హామీనిచ్చారు. ఏ ఒక్క వైసీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా పార్టీ అండగా నిలుస్తుందని ప్రకటించారు.