డాల్బీ థియేటర్లు వస్తున్నాయ్….హైదరాబాద్ కూడా

మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సాంకేతికత త్వరలో ఇండియాకు రాబోతోంది. డాల్బీ లాబొరేటరీస్ ప్రాధమికంగా ఎనిమిది నగరాల్లో తమ టెక్నాలజీ కూడిన స్క్రీన్లను ఏర్పాటు చేయబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు కోకాపేటలో నిర్మాణంలో ఉన్న అల్లు సినీ ప్లెక్స్ లో డాల్బీ తెర రానుంది. నగరంలో ఇదే మొదటిది కానుంది. దీంతో పాటు సిటీ ప్రైడ్ (పూణే), ఎల్ఏ సినిమా (త్రిచి), ఏఎంబి (బెంగళూరు), ఈవీఎం (కోచి), జి సినీప్లెక్స్ (ఉలిక్కల్)లో ఇవి ఏర్పాటు కాబోతున్నాయి.

ఇప్పటికే మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తున్న 4కె కన్నా డాల్బీ సినిమా అనుభూతి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి సన్నివేశంలోని మిల్లి మైక్రో ఫ్రేమ్ కూడా క్రిస్టల్ క్లియర్ గా ఒరిజినల్ కలర్స్ ని గొప్పగా చూపించేలా వస్తుంది. కళ్ళకు నమ్మశక్యం కానంత ఫీలింగ్ ని డాల్బీ ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కొన్ని ఖరీదయిన టీవీల్లో ఈ ఫీచర్ ఉంది కానీ అది కేవలం ప్రాధమిక స్థాయిలోనే అవుట్ ఫుట్ ఇస్తుంది. దానికి వందింతలు ఎక్కువ డీటెయిల్స్ థియేటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. కొన్ని నెలల క్రితమే డాల్బీ లాబ్స్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో తమ టెక్నాలజీని లాంచ్ చేయడం చూశాం.

మహేష్ బాబు బెంగళూరులో ప్రారంభించే ఏఎంబి మల్టీప్లెక్స్ లోనూ డాల్బీ సినిమా రావడం మరో విశేషం. సినిమా చూడటాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్న ఇలాంటి ప్రయత్నాలు జనాన్ని ఇంటికి పరిమితం చేయకుండా హాలు దాకా వచ్చేలా చేస్తాయి. ఈ తరహా విప్లవాత్మక మార్పులు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. భాగ్యనగరంలో ఇప్పటికే ఐమాక్స్ తెర లేకపోవడం మూవీ లవర్స్ పెద్ద లోటుగా ఫీలవుతారు. దాన్ని తీర్చే దిశగా డాల్బీ సినిమాస్ ఇప్పుడు రంగప్రవేశం చేయడం కేవలం ప్రారంభమేనని చెప్పాలి. కాకపోతే వాటిని మ్యాచ్ చేసే స్థాయిలో కంటెంట్ తీసే రాజమౌళి లాంటి దర్శకులు ఎందరో రావాలి.