రాష్ట్రంలో కొందరు షాడో మంత్రులుగా పనిచేస్తున్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తూనేఉంది. ఎమ్మెల్యే ల సోదరులు షాడో ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పుతున్నారు. మహిళా ఎమ్మెల్యేల భర్తలు కూడా ఇదే పనిలో ఉన్నారు. వీరిని నిలువరించాలని.. పార్టీలో ఉన్న కొందరు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయినా… కూడా అధిష్టానం ఎందుకనో.. చూసి కూడా చూడనట్టే వ్యవహరిస్తోందా? అనే వాదన వినిపిస్తోంది.
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక కీలక ఎమ్మెల్యే కమ్ చీఫ్ విప్ కుమారుడు కూడా షాడో మంత్రి పాత్రనే పోషిస్తున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. చీఫ్ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నిజానికి ఆయన మాత్రం మంత్రి పదవిని ఆశించారు. అయితే, కారణాలు ఏవైనా కూడా ఆయనకు అవకాశం చిక్కలేదు.
అయితే, పార్టీ అధినేత వద్ద ఉన్న పలుకబడి, ఆయన సేవలను గుర్తించిన సీఎం జగన్.. ఆయనకు చీఫ్ విప్ వంటి కీలక పదవిని అప్పగించారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చింది లేదు. కానీ, ఆయన కుమారుడు మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారని.. స్థానికంగా కొందరు పార్టీ కీలక నేతకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.
ముదునూరు సతీష్ రాజు.. కొన్నాళ్లుగా నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనూ చక్రం తిప్పుతున్నారని.. మంత్రి రేంజ్లో వ్యవహరిస్తున్నారని ఇక్కడి వైసీపీ నాయకులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అదేసమయంలో చేపలు, రొయ్యల చెరువుల వ్యాపారులు కూడా సతీష్ రాజు వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్నారు. తాము వ్యాపారాలు చేసుకోలేక పోతున్నామని,.. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా.. సతీష్ రాజు మాత్రం అంతా బాగానే ఉందని.. కావాలనే ఇలా చేస్తున్నారనే ప్రతి విమర్శలు చేయడం.. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది.