ఉన్నమాటంటే ఉలుకెక్కువ అనే సామెత ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అతికినట్టు సరిపోతుందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ నుంచి అమరరాజా పరిశ్రమ తరలిపోవడానికి వైసీపీ ప్రభుత్వ తీరే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలంతా విమర్శిస్తున్నారు. అయితే, ప్రభుత్వ తీరు వల్లే ఏపీ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా అమర రాజా సంస్థ ప్రతినిధులు ఎవరైనా చెప్పారా అని అమర్నాథ్ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ అదే నిజమైనా…బహిరంగంగా ఆ కారణాన్ని ఎవరూ చెప్పరు అన్నది వేరే విషయం. ఇక, పరిశ్రమల వ్యవహారాలను తమ ప్రభుత్వం ఏనాడు రాజకీయ కోణంలో చూడలేదని, కానీ ఓ వర్గం మీడియా మాత్రం విష ప్రచారం చేస్తోందని అమర్నాథ్ కామెంట్ చేశారు. ఇక, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ వ్యాపారం అంతా ఏపీలోనే ఉందని, ఆయనను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందా అని కూడా ఎదురు ప్రశ్నించారు. అయితే, గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
చిత్తూరులోని అమర రాజా సంస్థకు పర్యావరణ అనుమతులు లేవని, కాలుష్యం విడుదల చేస్తోందని జగన్ సర్కార్ నానా ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లిందని, కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానలేదని అంటున్నారు. ఆ సంస్థకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి చర్యలకు జగన్ సర్కార్ పాల్పడిందని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అమర రాజా సంస్థ విముఖత వ్యక్తం చేసి ఉండొచ్చని అంటున్నారు.
అంతేకాదు, చిత్తూరులోని తమ సంస్థను విస్తరించాలని ముందుగా అమరరాజా భావించిందని, కానీ, ఆ తర్వాత తమిళనాడుకు తరలి వెళ్లేందుకు కూడా ప్రయత్నించిందని కామెంట్ చేస్తున్నారు. అమరరాజా బ్యాటరీ సంస్థను పక్కనపెడితే మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదని, ఆల్రెడీ చేసుకున్న ఒప్పందాలను సైతం రద్దు చేసుకుని మరీ పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా..అమరరాజాపై మంత్రి అమర్నాథ్ చెప్పిన అమర చిత్ర కథపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.