తాజాగా మంగళగిరిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పాలక వైసీపీనేతలపై తీవ్ర విమర్శ లు గుప్పించారు. ఈ క్రమంలోనే ఆయన దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావించారు. బహుశ.. పవన్ ఇటీవల కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. “కత్తుల, గొడ్డళ్లు, బాడితలు ఉపయోగించే వాళ్లం కాదు మేం. మేం కష్టాన్ని నమ్ముకున్నాం. మీ లాగా.. పాపం వైఎస్ వివేకానందరెడ్డిగారిని.. కత్తులు గొడ్డళ్లు, బాడితలు ఉపయోగించి హత్య చేయించలేదు” అని అన్నారు.
అంతేకాదు.. హత్య చేసిన వారిని కనీసం విచారణకు కూడా రాకుండా కాపాడుతున్నారని పరోక్షంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరిని పవన్ పేర్కొన్నారు. బాత్‌రూంలో చంపేసి, గుండెపోటు నాటకం ఆడి.. ఎన్నికల్లో గెలిచే సత్తా తమకు లేదన్నారు. కోడికత్తి డ్రామాలు ఆడించి ప్రజలను మానసికంగా తమవైపుతిప్పుకొనే కుళ్లు, కుట్ర రాజకీయం తనకు తెలియదని చెప్పారు. ప్రజలకు మొహం మీదే చెబుతాం. వాళ్లను నమ్మించి.. తడిగుడ్డతో గొంతు కోసే టైపు కాదు.. అని వ్యాఖ్యానించారు.
“రాష్ట్రంలో అత్యాచారాలు జరిగిన ఆడబిడ్డలకు రక్షణలేకపోతే.. కనీసం ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఒకటి రెండు రేపులకే ఇంత గొడవ చేస్తారా? అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే.. తల్లుల పెంపకాన్ని తప్పుబట్టారు. ఇంత కన్నా దౌర్భాగ్యమైన నాయకులు ఉన్నారా? ఇది తోలు మందం బ్యాచ్. వారికి, వారి ఇంట్లోవారికి ఏదైనా జరిగితే తప్ప వీరికి బాధలు తెలియవు. వీరికి చీమకుట్టదు” అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా తనచిన్న నాటి ఘటనలను పవన్ గుర్తు చేసుకున్నారు. తాను నెల్లూరులో ఒక స్కూల్‌లో చదువుకునే సమయంలో ఆ స్కూల్‌కు ఎదురుగా ఉన్న ఇంటి గోడపై.. “రమిజాబి ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి” అని రాసి ఉంది. దీనిని తర్వాత తెలుసుకున్నానని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో హైదరాబాద్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో రమిజాబి అనే మహిళతో పాటు ఆమె భర్తను కూడా తీసుకువచ్చి హింసించారని పవన్ చెప్పారు.
ఆ సమయంలో భర్త చనిపోగా, రమిజాబిపై సామూహిక అత్యాచారం జరిగిందని.. దీనిపై అప్పట్లో కన్నబిరాం పోరాట స్ఫూర్తితో ఈ ఒక్క ఘటనపై దేశాన్నే కదిలించారని అన్నారు. ఇప్పుడు జనసేన కూడా అదే చేస్తోందని చెప్పారు. ఎక్కడ ఏతల్లిపై ఎలాంటి అఘాయిత్యం జరిగినా.. దానిపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని.. ఎక్కవ ఎవరికి అన్యాయం జరిగినా..అది తనకే అనుకుని పోరాటంలోకి దిగుతానని పవన్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates