ఏపీ సీనియర్ మినిస్టర్, విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి బొత్స డమ్మీ అయ్యారని, ఆయన వల్ల ఏమీ కావని, ఆయన పై ఆశలు కూడా పెట్టుకోవద్దని తూర్పు కాపు సామాజిక వర్గానికి పవన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా తూర్పుకాపుల సమస్యలను అధిష్టానానికి చెప్పడం తప్ప చేసేదేమీ కనిపించడం లేదని పవన్ వ్యాఖ్యానించారు.
మంత్రి బొత్స పరిస్థితే అలా ఉంటే ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండని హితవు పలికారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. తూర్పుకాపుల పక్షాన జనసేన నిలబడుతుందని, జనసేనకు ఓటు వేయాలని పవన్ పిలుపునిచ్చారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు, జనసేన కార్యకర్తలతో శనివారం పొద్దు పోయిన తర్వాత మంగళగిరిలో భేటీ అయిన పవన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్‌కు వార్నింగ్
నేను శ్రీకాకుళంలో పర్యటించలేదని, ఉద్దానం కిడ్నీ సమస్య గురించి నాకు తెలీదని ముఖ్యమంత్రి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆయన కోడి కత్తి డ్రామాలు ఆడుతున్నప్పుడు నేను ఉద్ధానంలోనే ఉన్నాను. ఆయనకు తెలియపోతే తెలుసుకుని మాట్లాడాలి. ఉద్దానం సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేశాను. నేను వాళ్లలా తేనే పూసిన కత్తిని కాదు. తియ్యని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయను అని పవన్ అన్నారు.
ఒక్క సినిమాను అవడానికి వాళ్లు మొత్తం యంత్రాంగాన్ని ఉపయోగించినప్పుడు, తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి మనం ఎందుకు యంత్రాంగాన్ని వాడకూడదని ప్రశ్నించారు. అధికారాన్ని వాళ్లు దుర్వినియోగం చేస్తే మేం సద్వినియోగం చేస్తామని చెప్పారు. తూర్పుకాపుల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడతామని జనసేనాని భరోసా ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates