కుల రాజకీయాన్ని కొత్తగా డీల్ చేసిన పవన్ 

ఏపీలో కుల రాజ‌కీయాలు పెరిగిపోయాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కులాలను వాడుకుని నేతలు ఎదుగుతున్నారు.. ఆడుతున్నారు తప్ప… కులాల్లోని ప్రజలు మాత్రం వెనకబడి పోతున్నారని అన్నారు.  సంఖ్యా బలం ఉన్న కులాలు ఐక్యతతో ఉంటే భవిష్యత్తులో రాష్ట్రం వారి చేతిలోనే ఉంటుందని తెలిపారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం నాయకులతో పవన్ భేటీ అయ్యారు.

బీసీ కులాలకు ఒక్కొక్క దానికీ ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టి కులానికో పదవి, రూ.75 వేలు జీతం పడేస్తే కులం మొత్తం మారు మాట్లాడకుండా ఉంటుందన్న భావన మారాలంటూ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు ప‌వ‌న్ షాకిచ్చారు. హక్కుల కోసం దేహీ అనే పరిస్థితి నుంచి హక్కులు సాధించుకునే పరిస్థితికి బీసీలు ఎదగాలని కోరుకుంటున్నానని తెలి పారు. “కులం, మతం, ప్రాంతాలను ఉద్దేశించి మాట్లాడాలంటే ఏ రాజకీయ పార్టీకైనా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి“ ఉంటుంద‌ని తెలిపారు.

“కులాన్ని నేను వేరే కోణం నుంచి చూస్తాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా కులం, మతం, ప్రాంతం అనే విషయాలకు భయపడకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఓటు బ్యాంకు రాజకీ యాలు చేయను. కాబట్టి, సామాజిక రుగ్మతలను సోషల్ డాక్టర్ మాదిరిగా స‌రిచేస్తాను. ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కావు వ‌ర్గం నుంచి ఒక ఎంపీ, ఒక మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేలు  ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.

అయితే, ఏపీలో దాదాపు 16 లక్షల మంది సంఖ్యాబలం ఉండి కూడా సమస్యలు తీర్చండి అని ప్రాధేయ పడటం బాధాకరమ‌న్నారు. “వైసీపీ నేతలకు మీరు మద్దతు పలికారు. లేకపోతే అంత మెజారిటీ వచ్చేది కాదు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. లంచం ఇస్తే తప్ప ఓబీసీ సర్టిఫికేట్ రాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారాలంటే బీసీ కులాల నుంచి నాయకత్వం పెరగాలి“ అని దిశానిర్దేశం చేశారు.

స్వలాభం కోసం కుల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారంటూ.. మంత్రుల‌పై విరుచుకుప‌డ్డారు. 2024 ఎన్నికల తర్వాత ఇలాంటి సమావేశాలు మళ్లీ జరగకూడదన్న ప‌వ‌న్‌.. ఇప్పుడు పోరాడకపోతే జీవితాంతం వైసీపీ నేత‌ల‌ మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చ‌రించారు. కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. కుల ప్రయోజనాలను కాపాడే నేతలను ముందు నిలబెట్టండి. వాళ్లకు డబ్బు లేకపోయినా ఫర్వాలేదు. మీరు నాయకత్వం పెంచుకోకపోతే కొద్ది మంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు.