మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇన్నాళ్లకు సీఎం జగన్ గొప్ప అవకాశం ఇచ్చారని అంటున్నారు నాని అనుచరులు. అదేంటంటే.. వచ్చే నెల 21న సీఎం జగన్ పుట్టిన రోజు ఉంది. ఆ రోజుతో జగన్‌కు 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు పేరిట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఇక, పుట్టిన రోజు నాడు, గుడివాడ కేంద్రంగా మరింతగా ఈ సంబరాలను ఆకాశాన్నంటేలా చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి కొడాలి నానికి జగన్ ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి సీమ నుంచి ఇద్దరు నాయకులు పోటీ పడినా.. సీఎం జగన్ నానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం గమనార్హం. దీంతో తన నియోజకవర్గంలో సీఎం జగన్‌కు సంబంధించిన కార్యక్రమం, పైగా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు కొడాలి ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే, ఆదిలోనే హంసపాదు మాదిరిగా కొడాలి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఎందుకంటే.. సుమారు 14 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పొలాల్లో రైతులకు కొడాలి వార్నింగ్ ఇచ్చి మరీ.. పంటలు వేయొద్దని హెచ్చరించినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. సీఎం సభ ఉంది కాబట్టి.. అక్కడ ఏమీ చేయొద్దని ఆయన ఆదేశించినట్టు పేర్కొంటున్నారు.
దీంతో ఈ విషయం వివాదంగా మారింది. రైతుల పక్షాన స్థానిక టీడీపీ నాయకుడు రావి వెంకటేశ్వరావు.. హైకోర్టుకు వెళ్లాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో ఈ పరిణామాలతో కొడాలి నానికి దక్కిన ఈ లక్కీ ఛాన్స్.. మిస్ అవుతుందా? అనే చర్చ జరుగుతుండడం గమనార్హం. ఇక, ఈ కార్యక్రమం కనుక సజావుగా సాగిపోతే.. కొడాలి ఇలాకాలో జగన్ తొలి కార్యక్రమంగా రికార్డు సృష్టిస్తుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో.. ఏం జరుగుతుందో చూడాలి.