ఒక్కసారి కాదు.. వందసార్లు కేసీఆర్ కాళ్లు మొక్కుతా

కొవిడ్ టైంలో తెలంగాణ‌లో బాగా పాపుల‌ర్ అయిన అధికారుల్లో రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ గ‌డ‌ల శ్రీనివాస‌రావు ఒక‌రు. క‌రోనా ప్ర‌భావం మొద‌ల‌య్యాక ఆయ‌న దాదాపు ప్ర‌తి రోజూ మీడియాలో క‌నిపించేవారు. కొవిడ్ అప్‌డేట్స్ ఇవ్వ‌డంతో పాటు సూచ‌న‌లూ చెప్పేవారు. ఐతే ఈ మ‌ధ్య శ్రీనివాస్ రాజ‌కీయ కార‌ణాల‌తో వార్త‌ల్లో వ్య‌క్తి అవుతుండ‌డం విశేషం.

ఆయ‌న అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న‌ట్లు తెలుస్తోంది. భ‌ద్రాద్రి-కొత్త‌గూడెం జిల్లా నుంచి శ్రీనివాస‌రావు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌బోతున్నార‌ని, ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆశీస్సులు కూడా ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఇటీవ‌ల ఆయ‌న కేసీఆర్‌ను క‌లిసిన సంద‌ర్భంగా పాదాభివంద‌నం చేయ‌డం, కేసీఆర్‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఒక ప్ర‌భుత్వ‌ అధికారి హోదాలో ఉండి ముఖ్య‌మంత్రి పాదాల‌కు న‌మ‌స్కారం చేయ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఐతే ఈ విమ‌ర్శ‌ల‌పై శ్రీనివాస‌రావు తాజాగా స్పందించారు. ఒక్క‌సారి కాదు వంద‌సార్లు కేసీఆర్‌కు పాదాభివంద‌నం చేస్తా అని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన‌డం విశేషం. ఈ మ‌ధ్య నేను కేసీఆర్ గారి పాద పద్మాలకు నేను నమస్కరించాను. దాని గురించి విమ‌ర్శిస్తున్నారు. ఒక్కసారి కాదు బరాబర్ వందసార్లు ఆయ‌నకు పాదాభివంద‌నం చేస్తా.

ఎందుకంటే మ‌న‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆయ‌న వైద్య కళాశాల ఇచ్చారు. కొత్త కాలేజీలు ఇచ్చేందుకు గాను నిర్వ‌హించిన స‌మావేశంలో నేను కూడా పాల్గొన్నా. నిజానికి ముందు మ‌న జిల్లా పేరు అందులో లేదు. కానీ కేసీఆర్ గారు మ‌న జిల్లాకు మెడిక‌ల్ కాలేజీ ఇచ్చారు. కేసీఆర్ అభిన‌వ బాపూజీ అని శ్రీనివాస‌రావు వ్యాఖ్యానించారు. శ్రీనివాస‌రావు తీరు చూస్తుంటే అతి త్వ‌ర‌లో ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేలా క‌నిపిస్తున్నారు.