ఏపీలో చిత్రమైన రాజకీయాలు తెరమీదకి వచ్చాయి. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ప్రశ్నల చిక్కుల్లో చిక్కుకుపోయారు. ఎందుకంటే.. పార్టీ పెట్టుకున్నది ఆయన.. పార్టీని బలోపేతం చేస్తున్నది ఆయన.. కానీ, పార్టీని, ఆయనను కూడా బీజేపీ నడిపిస్తోందా? అనేలా ఆ పార్టీ నాయ కులు ప్రయత్నించడం.. ప్రవర్తించడం కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. దీనిపై చర్చ కూడా సాగుతోంది.
అసలు జనసేనతో బీజేపీకి ఉన్న సంబంధం ఏంటి? అనేది చూస్తే.. నేతిబీరలో నెయ్యి మాదిరిగానే కనిపిస్తుంది. పవన్ ఏమీ ఆర్ ఎస్ ఎస్ వాదికాదు. ఆయన మోడీకి తాబేదారు అంతకన్నా కాదు. కేవలం తన అన్న చిరు పెట్టిన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని సహించలేక.. కొంత గ్యాప్ తీసుకుని.. ఆ ఫైర్‌లో పార్టీ పెట్టిన నాయకుడు. అయితే, రాను రాను పవన్ మంచితనమో.. లేక ఆయన మెతకతనమో తెలియదు కానీ, బీజేపీ ఆయనను అడ్డంగా వాడేసుకుంటోంది.
తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో.. పెట్టుకోకూడదో కూడా బీజేపీనే డిక్టేట్ చేసేస్తోంది. టీడీపీతో కలవద్దని మా అధిష్టానం చెప్పేసింది! అని సోము వీర్రాజు చెప్పారు. అంటే.. జనసేన ఏమన్నా.. బీజేపీ నుంచి ఊడి పడిన ఆ తాను ముక్కని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోనీ.. పవన్‌ను డిక్టేట్ చేయాలంటే.. ఆయనను గతంలో ఏమైనా గౌరవించారా?
కనీసం.. తిరుపతి బైపోల్‌లో టికెట్ ఇవ్వమని ఢిల్లీ వెళ్లి అడిగినా కాదన్నారు. బద్వేల్‌లో పోటీ వద్దులే.. ఆడకూతురు పోటీ చేస్తోంది. దీనిని సింపతీగా మార్చుకుని రాజకీయంగా బలపడదాం! అంటే, ఆనాడు గౌరవించారా? కనీసం.. వచ్చే ఎన్నికల్లో పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు అయినా మనసు ఒప్పుతోందా? ఏం అధికారం ఉందని పవన్‌ను నియంత్రిస్తున్నారనేది ప్రధాన ప్రశ్న. ఇదిలావుంటే.. ఇప్పుడు జనసేనను టీడీపీకి దూరం చేయడం ద్వారా.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చేసి.. ఆ పార్టీని గట్టెక్కించడం తప్ప బీజేపీకి ఉన్న ప్రత్యేక, ప్రధాన వ్యూహం ఏమీ లేదని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates