కేసీఆర్‌కు ఎందుకీ పొర్లు దండాలు?

ఔను! ఇప్పుడు నెటిజ‌న్లు ఇదే ప్ర‌శ్న సంధిస్తున్నారు. ఎందుకీ పొర్లు దండాలు? ఏం ఆశించి కాళ్ల పై ప‌డుతున్నారు? ఇంద‌కేనా ఉన్న‌త చ‌దువు చ‌దివింది? అని నిష్క‌ర్ష‌గా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఒక జిల్లాకు అధికారి అయిన వ్య‌క్తులు దండాలు పెట్టారంటే, కాళ్ల‌పై ప‌డ్డారంటే తెలిసి చేశారో.. తెలియ‌క చేశారో.. అని స‌రిపుచ్చుకోవ‌చ్చు. కానీ, రాష్ట్రం మొత్తానికి అధికారి.. అయిన తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు.. తాజాగా సీఎం కేసీఆర్ కాళ్ల‌పై ప‌డిపోయి ప‌దే ప‌దే దండాలు పెట్ట‌డాన్ని ఎలా అర్ధం చేసుకోవాల‌నేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌.

తాజాగా వైర‌ల్ అవుతున్న వీడియోలో రాష్ట్ర స్థాయి అధికారి(యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నియ‌మిత అధికారి) అయిన తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్‌.. సీఎం కేసీఆర్‌కు పాద న‌మ‌స్కారం చేశారు. అయితే, ఆయ‌న ప‌ట్టించుకోలేదు. దీంతో మ‌ళ్లీ మ‌రోసారి పాదాల‌పై ప‌డ్డారు. ఇది ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఉన్న‌త‌స్తాయి అధికారి అయి ఉండి.. ఇలా చేయ‌డం స‌బ‌బేనా.. కింది స్తాయి అధికారుల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు ? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. అంతేకాదు.. రేపు అధికారుల వ‌ద్ద తాము ఏదైనా ప‌నిపై వెళ్తే కూడా.. ఇలానే పొర్లు దండాలు పెట్టాలా? అని నిల‌దీస్తున్నారు.

వాస్త‌వానికి కొన్నాళ్లుగా శ్రీనివాస‌రావుపై తీవ్ర విమ‌ర్శ‌లే ఉన్నాయి. ఆయ‌న త‌న‌ప‌ని మానేసి.. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌బుత్వాన్ని వెనుకేసుకువ‌చ్చేలా కామెంట్లు చేశారు. ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల‌కు రాజ‌కీయ నేత‌లు ఇచ్చే స‌మాధానాల మాదిరిగా ఆయ‌న స‌మాదానాలు ఇచ్చారు. దీంతో అప్ప‌టి నుంచి కూడా మీడియా ఆయ‌న‌ను చాలా నిశితంగా గ‌మ‌నిస్తోంది. ఆయ‌నేదో రాజ‌కీయ ప‌ద‌విని ఆశిస్తున్నార‌నే గుస‌గుసా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్‌కు పొర్లు దండాలు పెట్ట‌డంపై మ‌రింత విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రొటోకాల్ ప్ర‌కారం.. పుష్ప‌గుచ్ఛం ఇవ్వ‌డం వ‌ర‌కు ధ‌న్య‌వాదాలు.. లేదా శుభాకాంక్ష‌లు చెప్ప‌డం వ‌ర‌కు స‌రే! కానీ, ఇలా స్తాయి మ‌రిచి.. పొర్లు దండాలు ఎందుకు? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. మ‌రి దీనికి ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతాడోచూడాలి.