వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి వస్తామని చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇటీవల కాలంలో దాదాపు మేనిఫెస్టోను ప్రకటించేస్తున్నారు. అంతేకాదు.. తాను సీఎం అయ్యాక చేసే తొలి రెండు సంతకాలు ఇవే అని కూడా చెబుతున్నారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టోపై పవన్ క్లారిటీకి వచ్చేశారా? అనే చర్చ సాగుతోంది. ఇటీవల ఇప్పటంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను సీఎం కాగానే.. రాష్ట్రంలోని ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఇదే తన రెండో సంతకం అని కూడా ప్రకటించి ఉద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే, దీనిపై పవన్ కు ఉద్యోగుల నుంచి ఆశించిన రియాక్షన్ అయితే రాలేదు. కానీ, ఆయన మాత్రం దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. తొలి సంతకం.. సుగాలి ప్రీతికి న్యాయం చేయడం పైనే ఉంటుందని అన్నారు. ఇక, తాజాగా విజయనగరంలో జగనన్న ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన పవన్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలపై ఎన్నికల వరాలు కురిపించారు.
తాము అధికారంలోకి వస్తే..ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు యథావిథిగా కొనసాగిస్తామని పవన్ చెప్పారు. అంటే.. ఇప్పటి వరకు వైసీపీ అనుసరించిన పథకాలను అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాకానుక వంటి అన్నింటినీ తాము అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. వీటికి అదనంగా.. ఇసుకను కూడా ఉచితంగా ఇస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాదు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, తాము అధికారంలోకి వచ్చాక.. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అవినీతి రహితంగా రాష్ట్రాన్ని పాలిస్తామని పవన్ ప్రకటించారు. ఎవరు అవినీతికి పాల్పడినా.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని సీఎం జగన్ ఉద్దేశించి అన్నారు. మొత్తానికి పవన్ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే.,. హామీలు ప్రకటించడం, సంతకాలు చేస్తుండడం ఆసక్తిగా మారింది. మరి దీనికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates