ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముందు చేతులెత్తేశారా? కనీసం.. తనను తాను పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా విశాఖ పట్నం వచ్చిన ప్రధానితో భేటీ అయ్యేందుకు సోము వీర్రాజునేతృత్వంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ మోడీ దగ్గరకు వెళ్లింది. అయితే.. ఇక్కడ వీర్రాజుకు ఘోర పరాభవం ఎదురుకావడం గమనార్హం.
ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ చీఫ్ సోమును చూసి.. నీపేరేంటి? అని ప్రశ్నించేసరికి.. వీర్రాజుకు మైండ్ బ్లాంక్ అయినంత పని జరిగింది. ఆర్ఎస్ఎస్ వాదిగా.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సోము వీర్రాజు ఫేస్ ప్రధానికి తెలియకపోవడం.. చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. మీరు రాజకీయాలు కాకుండా ఏం చేస్తుంటారు..అని ప్రధాని ప్రశ్నించారు. అయితే, దీనికి సోము తడబడ్డారు. రాజకీయాలు కాకుండా ఏం చేస్తున్నారని అన్నారంటే.. ఏదో జరుగుతోందని భావించిన ఆయన తడబడ్డారు.
ఇక, రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని ప్రధాని మోడీ ప్రశ్నించారు. దీంతో సోము వీర్రాజు ఎలాంటి తొట్రుపాటు లేకుండా.. 21 సర్! అని ఠక్కున సమాధానం చెప్పారట. కానీ, వాస్తవానికి రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. దీంతో పక్కనే ఉన్న పురందేశ్వరి వంటి నాయకులు. సరిదిద్దే ప్రయత్నం చేసి 26 సర్ అని ప్రధాని చెప్పారు. ఈ పరిణామాలతో ప్రధాని మోడీ ముందు సోము వీర్రాజు చేతులు ఎత్తేశారనే కామెంట్టు బీజేపీ నాయకుల మధ్య చర్చగా మారాయి.