ఏపీలో కొత్త జిల్లాలు 25? 26?.. కన్ఫ్యూజన్

New District

రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలనను మరింత వికేంద్రీకరించే క్రమంలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేయటం తెలిసిందే. పది కాస్తా ముప్ఫై మూడు కావటంతో టీఆర్ఎస్ సర్కారుకు పెద్ద సమస్యలు ఎదురు కాలేదు. అయిన్పటికీ కొన్ని జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు సాగుతోంది.

ఎన్నికలకు ముందుగా జగన్ పార్టీ ప్రతి లోక్ సభ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని పాతిక ఎంపీ స్థానాలు పాతిక జిల్లాలుగా మారనున్నాయి. అయితే.. ఆ మధ్యన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో కొత్త కన్ఫ్యూజన్ తెర మీదకు వచ్చింది. మొదట్నించి చెబుతున్న దాని ప్రకారం పాతిక లోక్ సభ స్థానాలకు పాతిక జిల్లాలుగా ఏర్పాటు చేయాలనుకున్న వేళలోనే..సీఎం జగన్ మాత్రం ఒక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న మాట చెప్పారు.

దీంతో.. ఏపీలో ఏర్పాటు చేసేది పాతిక జిల్లాలా? ఇరవై ఆరు జిల్లాలా? అన్నది ప్రశ్నగా మారింది. జగన్ ఏర్పాటు చేస్తానని చెప్పిన గిరిజన జిల్లా శ్రీకాకుళం.. విజయనగరం మధ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఇదేమీ కాకుండా అరకును విశాఖ జిల్లా నుంచి వేరు చేసిన కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్రీకాకుళం.. విజయనగరం మధ్యన ఉన్న పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వాదనలు ఇలా కొనసాగుతుండగా.. కొత్త జిల్లాల మీద ఎవరూ క్లారిటీ ఇవ్వని పరిస్థితి.

మొత్తంగా చూస్తే.. ఏపీలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఎన్ని జిల్లాలు అన్న దానిపైనా కన్ఫ్యూజన్ నెలకొందని చెప్పక తప్పదు. ఏమైనా ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ కానుంది.