అందుకే రాహుల్ నా చేయి పట్టుకున్నారు.. పూనమ్ క్లారిటీ

భారత జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఇప్పటివరకు లేని కొత్త వివాదం ఒకటి తెలంగాణలో ఆయన జరిపిన యాత్ర సందర్భంగా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సోషల్ మీడియా ఫైట్ అంతకంతకూ పెరిగింది. రాహుల్ పాదయాత్ర సందర్భంగా సినీ నటి పూనమ్ కౌర్.. చేనేత వస్త్రాల్ని ధరించి వెళ్లటం.. చేనేత మీద విధించిన జీఎస్టీని తొలగించాలన్న అంశాన్ని పరిశీలించాలని కోరటం తెలిసిందే. దీనికి స్పందించిన రాహుల్.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత మీద విధించిన జీఎస్టీని ఎత్తేస్తామని తనకు హామీ ఇచ్చిన వైనాన్ని పేర్కొన్నారు.

జోడో యాత్ర సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన పూనమ్ కౌర్ చేతిని రాహుల్ గాంధీ పట్టుకున్న వైనం ఇప్పుడు రాజకీయ రగడగా మారింది. పూనమ్ చేతిని రాహుల్ పట్టుకున్న ఫోటోను బీజేపీ మహిళా నేత ఒకరు ట్విటర్ లో పోస్టు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూనం చేతిని పట్టుకున్న రాహుల్ ఫోటోను పోస్టు చేస్తూ.. తాత అడుగు జాడల్లో అంటూ బీజేపీ నేత ప్రీతి గాంధీ కామెంట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

పలువురు మహిళలతో మోడీ ఉన్న ఫోటోల్ని వారు పోస్టు చేస్తూ.. తమ నేతకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివేళ.. ఈ మొత్తం ఇష్యూకు కారణమైన పూనమ్ కౌర్ తాజాగా రియాక్టు అయ్యారు. పాదయాత్ర సందర్భంగా రాహుల్ ను కలిసిన సందర్భంలో ఆయనతో పాటు తాను నడిచిన వైనాన్ని గుర్తు చేస్తూ.. ఆ సందర్భంగా తాను కాలు జారి కింద పడబోతే రాహుల్ తన చేతిని పట్టుకున్నారని.. దీనికి ఇంత రార్ధంతం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. పూనమ్ కౌర్ చేతిని పట్టుకున్న రాహుల్ గాంధీ ఫోటో ఇప్పుడు ప్రముఖంగా వైరల్ కావటం గమనార్హం