గతానికి విరుద్దంగా వర్తమాన రాజకీయాల్ని గమనిస్తే.. ఒక కొత్త కోణం కనిపిస్తుంది. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే కొత్త తరహా కుట్రలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. సున్నిత మనస్కుడ్ని చేతకానివాడిలా.. శాంత స్వభావిని పిరికివాడిలా.. సర్దుకుపోయే గుణాన్ని ధైర్యం లేకపోవటాన్ని..పదవీ కాంక్షను ప్రదర్శించని వ్యక్తిని పప్ను మాదిరిగా చిత్రీకరిస్తున్న వైనం భారతావనిలో చూస్తున్నాం. దీనికి నిలువెత్తు నిదర్శనంగా రాహుల్ గాంధీని చెప్పాలి. ఆయనకు సంబంధించిన గుణాల్ని బయటకు రాకుండా.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రక్రియ ఒక కొన్నేళ్లుగా జరుగుతోంది.
ఆయన్ను రాకుమారుడిగా.. ఎలాంటి సామర్థ్యం లేని వ్యక్తిగా.. పప్పుగా.. అమూల్ బేబీ మాదిరిలా క్రమపద్ధతిలో జరిపిన ప్రచారంలో ఏ మాత్రం నిజాలు లేవని.. అవన్నీ కుట్రపూరితంగా జరుగుతున్నవన్నది ఈ మధ్యన తరచూ బయటకొస్తున్నాయి. బ్రిటీషోడి విభజించి పాలించు ఫార్ములాను మారిన కాలానికి తగ్గట్లుగా మార్చేసి.. మనుషులమధ్య మత చిచ్చును పెట్టి.. మనిషి మనిషికి మధ్య దూరాన్ని పెంచటమే కాదు.. దానికి మించి అపనమ్మకాన్ని పెంచే కొత్త తరహా రాజకీయం కొన్నేళ్లుగా సాగుతోంది. ఇలాంటి వాటిని బద్ధలు కొడుతూ.. బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ. కొంతకాలంగా ఆయన మాటలోనూ.. చేతల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికి అధికారం కోసం తపించని విలక్షణ గుణం రాహుల్ లో కనిపించటం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి. ఆయన చేపట్టిన జోడో యాత్ర ఇప్పుడు తెలంగాణలో సాగుతోంది. ఈ ఆదివారం ఆయన అనూహ్య రీతిలో వ్యవహరించారు. మూడు వారాల క్రితం తన జోడోయాత్రలో భాగంగా కర్ణాటకలో పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య చేతిని పట్టుకొని.. తనతో పాటు పరిగెత్తేలా చేశారు. సిద్ధరామయ్య వయసును పరిగణలోకి తీసుకున్న రాహుల్.. పరిగెత్తే విషయంలో జాగ్రత్తలు పాటించారు.
తాజాగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న రాహుల్.. ఈ రోజు (ఆదివారం) ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలో నడుస్తూ.. ఫిట్ నెస్ ఫర్ భారత్ జోడో అంటూ కాసేపు పరుగు తీసి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్తుజితుల్ని చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సహా పార్టీ నేతలు.. కార్యకర్తలు పలువురు రాహుల్ ను అనుసరిస్తూ పరుగు తీశారు. రాహుల్ పరుగు తీసిన తీరు చూస్తే.. ఆయనెంత ఫిట్ గా ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. మొత్తంగా తనలో ఇప్పటివరకు దేశ ప్రజలకు పరిచయం కాని కోణాల్ని పరిచయం చేస్తున్న రాహుల్.. ఇతన్నేనా మనం పప్పు అంటూ గేలి చేసిందన్న ఆలోచనను రగిలించేలా చేస్తున్నారని చెప్పకతప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates