జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖను విడిచి పెట్టడం లేదు. ఈ నెల 5న విశాఖ కేంద్రంగా ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, అదేరోజు వైసీపీ నాయకులు గర్జన పేరుతో హల్చల్ చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలనే డిమాండ్‌తో వైసీపీ నేతలు ఇక్కడ ర్యాలీ నిర్వహించారు.ఆ తర్వాత విశాఖ విమానాశ్రయంంలో ఏర్పడిన వివాదం చినుకు చినుకు గాలి వాన అయిన చందంగా పవన్‌కు, వైసీపీ నేతలకు మధ్య భారీ గ్యాప్ పెంచేసింది. కేసులు, కోర్టుల జోక్యం వరకు కూడా వెళ్లింది. ఇక, పవన్‌ను అక్కడి నుంచి పోలీసులు పంపేశారు.
ఇదిలావుంటే, తాజాగా పవన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖను దోచేసేందుకే వైసీపీ నాయకులు ఇక్కడ రాజధాని కోరుతున్నారని.. కొన్ని రోజుల నుంచి చెబుతున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఇదే వాయిస్‌ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన వచ్చే 3న విశాఖలో లాంగ్ మార్చ్‌కు రెడీ అయ్యారు.
“చలో విశాఖపట్నం
ఒక్కటిగా నడుద్దాం
ఒక విప్లవ ఉప్పెనై బలంగా వీద్దాం
ఒక బలమైన నిరసన గళాన్ని వినిపిద్దాం
ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కోసం”
- అని ప్రచారం పోస్టర్‌లో పేర్కొన్నారు.
వచ్చే నెల 3వ తారీకు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు పోస్టర్‌లోనే పేర్కొన్నారు. మరి ఈ మార్చ్‌కు పోలీసులు అనుమతించారో.. అనుమతించాలో తెలియాల్సి ఉంది. ఏదేమైనా పవన్ పట్టువీడకుండా సర్కారుపై పోరాటం చేయడం ఆసక్తిగా మారింది. చివరకు ఏం తేలుతుందో చూడాలి. యువత సమీకరణ తేలికే అయినా సీనియర్లను, మేదావులను మాత్రం ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఇక, ఈ మార్చ్‌కు పార్టీలకు అతీతంగా నాయకులు కలిసివస్తారో లేదో కూడా చూడాలి. ముఖ్యంగా బీజేపీ పొత్తులో ఉంది కనుక కనీసం ఈ పార్టీ ఇప్పటికైనా పవన్‌తో కలిసి అడుగులు వేస్తుందో లేదో తెలియాలంటే 3వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.