టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహానికి వైసీపీ చిక్కుకుందా? బాబు వేసిన స్కెచ్‌లో ఇరుక్కుపోయిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు టీడీపీని వైసీపీ టార్గెట్ చేసింది. గత పాలన.. గత అభివృద్ధి అంటూ.. చంద్రబాబును ఇరుకున పెట్టింది. దీంతో చంద్రబాబుకానీ, ఇతర నాయకులు కానీ కౌంటర్ ఇచ్చినా వైసీపీ నుంచి ఎదురు దాడి చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. పైగా.. టీడీపీలో చాలా తక్కువ మంది మాత్రమే స్పందిస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా.. చంద్రబాబు మాట పెడచెవిన పెడుతున్నారు.
దీంతో వ్యూహం మార్చిన చంద్రబాబు.. తను రాజకీయంగా విమర్శలు తగ్గించుకున్నారు. ఇదేసమయంలో తనతో చేతులు కలిపేందుకు రెడీగా ఉన్నారని సంకేతాలు అందుకున్న వెంటనే.. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారనే టాక్ వినిపిస్తోంది. అంటే.. వైసీపీని టార్గెట్ చేయడం.. ప్రభుత్వ అభివృద్ధి పనులను టార్గెట్ చేయడం వంటివాటిని దాదాపు పవన్‌కు అప్పగించేసినట్టు అయింది. దీంతో పవన్ వెంటనే అందిపుచ్చుకుని మంత్రులను టార్గెట్ చేస్తూ.. ప్రశ్నలు సంధించాడు. అంతేకాదు.. అభివృద్ధిపై చర్చకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని అన్నారు.
ఇదిలావుంటే.. వైసీపీకి ఇప్పుడు పవన్‌ను టార్గెట్ చేసేందుకు అవకాశం చిక్కడం లేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం లేదు. గతంలో ఆయన పాలన చేయలేదు. సో.. దానిని చూపించి ఎదురు చేసేందుకు అవకాశం లేదు. పైగా.. పవన్ ను ఎంత తిట్టినా ఫర్వాలేదా..? అంటే.. చంద్రబాబును తిట్టినట్టు.. పవన్‌ను తిట్టడానికి లేకుండా పోయింది. ఎందుకంటే..పవన్ వెంట ఉన్న అభిమాన యువత కానీ, కాపులు కానీ.. పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. సహించరు. పైగా.. వైసీపీకి ఉన్న సానుభూతి కూడా పోయే ప్రమాదం ఉంది.
సో.. ఎంత కోపం ఉన్నప్పటికీ… పవన్‌ను నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టే పరిస్థితి లేదు. రాజకీయంగా ఏమైనా అందామా.. అంటే, ఆయన అసలు అసెంబ్లీలో అడుగు పెట్టింది కూడా లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్‌ను రాజకీయంగా కూడా టార్గెట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా పవన్ దూకుడు పెంచితే.. దానికి తగిన విధంగా వైసీపీ దూకుడు పెంచలేని పరిస్థితి ఉందని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. తాను తప్పుకొని జనసేనను రంగంలోకి దించడం ద్వారా చంద్రబాబు వేసిన గేలానికి వైసీపీ చిక్కుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.