పిక్ టాక్: రాహుల్‌తో పీకే

హెడ్డింగ్ చూడగానే ఈ పీకే ఎవరు..? జనసేన అధినేత పవన్ కళ్యాణా.. లేక మోస్ట్ వాంటెడ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోరా అన్న ఆలోచన కలిగి ఉంటుంది. కానీ ఈ పీకే ఆ ఇద్దరిలో ఎవరూ కాదు.. పూనమ్ కౌర్. ఈ పంజాబీ భామ సినిమాల్లో పెద్దగా మెరుపులు మెరిపించింది లేదు కానీ.. వ్యక్తిగత విషయాలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. 

పవన్ కళ్యాణ్‌తో ఆమె పేరును ముడిపెడుతూ రకరకాల ఊహాగానాలు షికార్లు చేయడం తెలిసిందే. అప్పుడప్పుడూ వివాదాస్పద ట్వీట్లతో పూనమ్ పలుమార్లు ఆమె వార్తల్లో నిలిచింది. ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా దక్షిణాది మీద కేంద్రం చూపించే వివక్ష గురించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్‌ను ఆమె ప్రశ్నించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజకీయ అంశాలపై ఆమెకు మంచి అవగాహనే ఉందే అని అనుకున్నారు జనం అప్పుడు. 

తాజాగా ఆమె రాహుల్ గాంధీతో కలిసి కనిపించడం చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో భారత్ జోడో యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. తాజాగా తెలంగాణలో అడుగు పెట్టారు. మహబూబ్ నగర్ సమీపంలోని ధర్మపుర్ నుంచి శనివారం ఆయన యాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్రలో పూనమ్ కౌర్ కూడా పాల్గొంది. రాహుల్ గాంధీతో కలిసి ఆమె అడుగులేసింది. 

ఈ ఫొటో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. పూనమ్ యధాలాపంగా వచ్చి ఈ యాత్రలో పాల్గొందా లేక రాజకీయాల్లోకి రాబోతోందా.. కాంగ్రెస్ పార్టీలో ఏమైనా చేరబోతోందా అన్న చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. మొత్తానికి ఈ పనితో పూనమ్ వార్తల్లో వ్యక్తిగా మారిపోయింది. మీడియా దృష్టిని ఎలా ఆకర్సించాలో ఆమెకు బాగా తెలుసని కూడా కొందరు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. మరి ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండబోతాయో చూడాలి.