పవన్ను బతిమలాడుకుంటున్నారా ?

ఏపీలో బీజేపీ నేతల పరిస్ధితి మరీ అన్యాయంగా తయారైపోయింది. ఒకవైపు మీతో నాకు పొత్తువద్దంటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా చెబుతున్నా కమలనాదులు పట్టించుకోవటంలేదు. లేదులేదు జనసేన తమతోనే ఉండాలని బీజేపీ నేతలు బతిమలాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసే పోటీ చేస్తాయని ఢిల్లీలో పార్టీ ఇన్చార్జి సునీల్ దియోధర్ ప్రకటించారు.

ఇక్కడ అందరికీ స్పష్టంగా అర్ధమవుతున్నదేమంటే బీజేపీతో కలిసుండటానికి పవన్ ఇష్టపడటంలేదని. ఈ విషయాన్ని పవన్ ఏమీ దాచుకోలేదు. మొన్నటి మీడియా సమావేశంలో మాట్లాడుతు తాను బీజేపీతో విసిగిపోయినట్లు స్పష్టంగా చెప్పేశారు. ప్రభుత్వంపై పోరాటం చేయటానికి రోడ్డుమ్యాప్ అడిగితే బీజేపీ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఈ కారణంగానే తాను బీజేపీతో విసిగిపోయి తన నిర్ణయం తాను తీసేసుకున్నట్లు చెప్పారు.

తన నిర్ణయం తాను తీసేసుకున్నట్లు చెప్పారే కానీ ఆ నిర్ణయం ఏమిటో మాత్రం ప్రకటించలేదు. అయితే మీడియా సమావేశం జరిగిన కాసేపటికే పవన్-చంద్రబాబు భేటీ జరిగింది. చంద్రబాబుతో భేటీతోనే తన నిర్ణయం ఏమిటో పవన్ పరోక్షంగా చెప్పినట్లయ్యింది. బీజేపీతో కలిసిపనిచేసే ఉద్దేశ్యం లేదని పరోక్షంగా చెప్పిన పవన్ అదే విషయాన్ని ఇప్పటివరకు డైరెక్టుగా మాత్రం చెప్పలేదు. బహుశా దాన్నే బీజేపీ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకున్నట్లుంది. అందుకనే పదే పదే పవన్ తమతోనే ఉంటాడని, వచ్చే ఎన్నికల్లో తమ రెండు పార్టీలే కలిసి పనిచేస్తాయని చెబుతున్నారు.

ఏపీ ఇన్చార్జి సునీల్ దియోధర్ మాట్లాడుతు టీడీపీ కుటుంబపార్టీ అని, చంద్రబాబునాయుడుతో కలిసే ప్రశక్తేలేదని చెప్పారు. నిజానికి ఇక్కడ ఇష్యూ పవన్దే కానీ చంద్రబాబుది కాదు. అయినా సరే పవన్ తో పాటు చంద్రబాబును కూడా దియోధర్ పిక్చర్లోకి లాగటమే ఆశ్చర్యంగా ఉంది. సునీల్ మాట్లాడింది ఎలాగుందంటే తమను వదిలేసి వెళ్ళవద్దని పవన్ను బీజేపీ బతిమలాడుకుంటున్నట్లుంది. పవన్ లేకపోతే తమకు పదిఓట్లుకూడా పడదని కమలనాదులకు అర్ధమైనట్లుందేమో.