ఆయన నోరు విప్పితే.. నిప్పులు రాలతాయి.. ఆయన మీడియా ముందుకు వస్తే.. విపక్షాలపై విమర్శల శతఘ్నులు పేలతాయి. పెద్దగా రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు.. గుడివాడ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కొడాలి నాని. తిరుగులేని దూకుడుతో గత నాలుగు ఎన్నికల నుంచి వరుస విజయాలు దక్కించుకుంటున్నారు నాని. అదృష్టమో.. నోరో కలిసి వచ్చి.. ఆయనకు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా వరించింది. అయితే.. ఇప్పుడు అదే నానిలో ఓ పావలా సైజులో.. కలవరం మొదలైందని.. అంటున్నారు పరిశీలకులు.
నిజానికి తన గెలుపును ఎవరూ ఆపలేరని.. తన నియోజకవర్గంలో అడుగు పెట్టే మొనగాడు కూడాలేరని.. నాని పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అయితే. . రోజులు అన్నీ ఒకేలా ఉండవు కదా.. ఇప్పుడు అదే జరుగుతోంది. నాని దూకుడుకు అడ్డు కట్ట వేయాలనేది . ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయం. అయితే.. ఈ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా.. ఇది సాధ్యం కావడం లేదు. దీంతో నాని పై చేయిసాధిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీ గేర్ మార్చింది. బలమైన నాయకుడిని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
ఈయన ఆర్థికంగా.. కోటీశ్వరుడు కావడంతోపాటు.. పారిశ్రామికంగా.. దేశంలోనే మంచి పేరున్న వ్యక్తిగా టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం. ఈయనకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా.. రెడీ అయ్యారని అంటున్నారు. ఏడాది ముందుగానే నియోజకవర్గంలోకి అడుగు పెట్టడంతోపా టు.. ఇక్కడ భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు, రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక, ఈ విషయం తెలిసిన కొడాలి గూటిలో కలవరం ప్రారంభమైంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు నోరేసుకుని గెలిచామనే వాదన ఉంది.
లేదా.. కొందరిని ఎన్నికల సమయంలో మేనేజ్ చేసుకుని విజయం దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే.. ఇప్పటి వరకు లోకల్‌గా పోటీ చేసిన టీడీపీ నేతలు అందరూ.. కూడా నానితో సంబంధాలు ఉన్నవారే. కానీ.. ఇప్పుడు తెరమీదికి వచ్చిన టీడీపీ నేత.. కృష్ణాజిల్లాకు చెందిన వారే అయినా.. నానితో సంబంధాలు లేవు. దీంతో ఆయనతో మిలాఖత్ అయ్యే అవకాశం లేదు. పైగా.. టీడీపీ+జనసేన కూడా.. ఈ దఫా గుడివాడను పోటాపోటీగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచారనేది ప్రధానం కాదు.. టీడీపీ అయినా.. జనసేన అయినా.. ఇక్కడ గెలిచి తీరాలనే లక్ష్యంతో ఉన్నాయి. దీంతో ఈ విషయం తెలిసి.. కొడాలి వర్గం.. కలవరంలో పడిందనే టాక్ వినిపిస్తోంది.