రెబ‌ల్స్‌పై ఇప్ప‌టి నుంచే వేటు..జ‌గ‌న్ వ్యూహం ఇదేనా..?

సాధార‌ణంగా.. ఎన్నిక‌లు అన‌గానే.. టికెట్లు ఆశించేవారు ఎక్కువ‌గానే ఉంటారు. అందునా.. అధికార పార్టీ ఏదైనా.. దానిలో టికెట్ల కోసం.. పోటీ ప‌డేవారు కూడా పెరుగుతారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉన్న‌దే. ఇక‌, మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం.. ఖాయ‌మ‌నే అంచ‌నాలు వేసుకుంటున్న వైసీపీలో ఈ టికెట్ల గోల మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే.. పార్టీలో చాలా మందికి టికెట్లపై ఆశ ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎలాగూ ద‌క్క‌లేదు. ఇప్పుడైనా.. ద‌క్కుతుందా? అని వారు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇలాంటి వారిలో కొంద‌రికి.. పార్టీలోనో.. నామినేటెడ్‌లోనో ప‌ద‌వులు ఇచ్చి.. సీఎం జ‌గ‌న్‌.. బుజ్జ‌గిస్తున్నారు.

అయితే.. ఇక‌, వీళ్ల వ‌ల్ల ఏమీ కాదు.. పార్టీకి కూడా భారం అనుకుంటున్న వారిని ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల కాలంలో ఇద్ద‌రు నేత‌ల‌ను ప‌క్క‌న పెట్ట‌డం.. వారిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది. పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేసిన క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన రావి వెంక‌ట ర‌మ‌ణ‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేశారు. పొన్నూరు నియోజకవర్గానికి చెందిన రావి చాలా కాలంగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై పోరాడారు భారీగా ఖర్చు పెట్టుకుని రెండు సార్లు ఓడిపోయారు.

గత ఎన్నికల్లో రావికి టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేశారు. అయితే.. చివరి క్షణంలో చోటు చేసుకున్న భారీ మార్పుతో ఆయ‌న‌ను త‌ప్పించి.. ఉమ్మారెడ్డి అల్లుడు రోశయ్యకు సీటిచ్చారు. దీంతో రావి వెంకటరమణ తీవ్ర‌స్థాయిలో నిరాశ‌కు గుర‌య్యారు. అయినా ఆయన ఏదో ఓ అవకాశం కల్పిస్తారని ఎదురు చూస్తూ పార్టీలో ఉన్నారు. ఏమీ కల్పించకపోగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. ఆయ‌న టికెట్ కోసం ప‌ట్టుబ‌డ‌తార‌ని.. భావించి.. తాజాగా ఆయ‌న పై వేటు వేశారు. ఇక‌, ఉమ్మ‌డి కృష్ణాలోని.. పామ‌ర్రు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌పైనా.. తాజాగా పార్టీ నుంచి స‌స్పెండ్‌ చేశారు.

ఈయ‌న కూడా.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించారు. అయితే.. కైలే అనిల్‌కుమార్‌కు టికెట్ ఇచ్చారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని.. దాస్ కోరుతున్నారు. కానీ, ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేదు. పైగా.. ఆయ‌న పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి చూసినా.. ఫ‌లితం లేద‌ని, వీరంతా రెబ‌ల్ అవుతార‌ని.. ఇప్పుడే వారిని వ‌దిలించుకుంటే.. ఎన్నికల‌ స‌మ‌యానికి.. ఇబ్బంది లేకుండా ఉంటుంద‌ని.. జ‌గ‌న్ భౄవిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే రెబ‌ల్స్‌పై వేటువేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.