విశాఖ ఎపిసోడ్ తర్వాత వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నేతలను పరుష పదజాలంతో పవన్ ఓ రేంజ్ లో దుయ్యబట్టారు. పవన్ విమర్శలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి విమర్శలు కూడా గుప్పించారు. పవన్ భాషకు ఏ మాత్రం తగ్గకుండా వైసీపీ నేతలు కూడా బూతు పంచాంగం అందుకున్నారు. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు.
కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారని పవన్ ను ఉద్దేశించి పరోక్షంగా జగన్ కౌంటర్ ఇచ్చారు. 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మూడు రాజధానులు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకోమంటే వ్యవస్థ ఏమైపోతుంది అని ప్రశ్నించారు. నాలుగైదేళ్లు కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకొని.. పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుబెడితే వ్యవస్థ ఏం బతుకుంది అని పవన్ పెళ్లిళ్లపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ పరిస్థితి కొనసాగితే ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి.. ఒక్కసారి ఆలోచన చేయడం అంటూ జగన్ కామెంట్లు చేశారు. ఏకంగా టీవీల ముందుకొచ్చి మరీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని కొందరు చెబుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన భాషలో తిడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్లా మన నాయకులని విరక్తి కలుగుతున్నందని జగన్ అన్నారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లాడరని పవన్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ఒక్కొక్కరూ మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే మన అక్కాచెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి, ఎంతోకొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తోందని జగన్ అన్నారు. పరోక్షంగా పవన్-చంద్రబాబుల పొత్తుపై కూడా జగన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates