బీజేపీలో ప్రకంపనలు!

రాష్ట్ర బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో కలిసి దియోధర్ విజయవాడకు చేరుకోవటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడి చేయడం, తర్వాత పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హోటల్ రూముకే ఒక రోజంతా పరిమితమైపోవటం అందరికీ తెలిసిందే.

విశాఖ నుంచి విజయవాడ చేరుకున్న పవన్ పార్టీ మీటింగులో తనను ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడంటున్న వైసీపీ నేతలపై బూతులు తిడుతు రెచ్చిపోయారు. అదే సమయంలో మాట్లాడుతు బీజేపీ మీద కూడా తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేయాలని అనుకుంటే బీజేపీ సహకరించటం లేదని మండిపోయారు. అందుకనే తన నిర్ణయం తాను తీసేసుకున్నట్లు చెప్పారు.

ఆ నిర్ణయం ఏమిటో చెప్పకపోయినా తర్వాత కొద్దిసేపటికే చంద్రబాబునాయుడుతో భేటీఅయ్యారు. వీళ్ళిద్దరి భేటీ బీజేపీలో సంచలనంగా మారింది. ఇది జరిగిన మరుసటిరోజే సీనియర్ నేత, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ వీర్రాజుపై మండిపడ్డారు. పవన్ విషయంలో బీజేపీ సరిగా స్పందించలేదన్నారు. మొత్తం మీద బీజేపీ పనితీరు ఏమీ బావోలేదని ధ్వజమెత్తారు. ఒకదాని తర్వాత మరోక పరిణామాలు వెంటవెంటనే జరిగిపోవటంతో కమలనాథుల్లో అయోమయం పెరిగిపోతోంది.

బహుశా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే అగ్రనాయకత్వం దియోధర్ ను రంగంలోకి దింపినట్లుంది. దియోధర్ కి పార్టీలోని అందరు నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇన్చార్జి వచ్చింది పవన్ తో మాట్లాడటానికా లేకపోతే కన్నాతో భేటీ అవటానికా అన్న విషయంలో స్పష్టతలేదు. తనతో పాటు చాలామందికి వీర్రాజు పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉందని కన్నా చెప్పారు. ఈ నేపధ్యంలోనే సీనియర్లందరితో దియోధర్ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మరి భేటీలో ఏమి తేలుతుందనేది ఆసక్తిగా మారింది.