2019 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దాని వల్ల రెండు పార్టీలకూ చేటు జరిగింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే రెంటికీ అంతటి దారుణ పరాభవం ఎదురయ్యేది కాదు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతటి ఘన విజయాన్ని అందుకునేది కాదు. ఓట్ల చీలిక వల్ల వైసీపీ బాగా ప్రయోజనం పొందితే.. చాలా సీట్లలో టీడీపీకి, జనసేనకు నష్టం జరిగింది. ఈసారి కూడా ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తేనే తమకు ప్రయోజనం అన్నది వైసీపీ నేతలకు బాగా తెలుసు.
అందుకే ఆ దిశగా రెండు పార్టీలను రెచ్చగొట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. దమ్ముంటే పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయండని ఇరు పార్టీలను రెచ్చగొడుతుంటారు. ముఖ్యంగా జనసేనను ఈ విషయంలో రోజూ గిల్లుతూనే ఉంటారు అధికార పార్టీ వాళ్లు. కానీ వారి ఆకాంక్షలకు విరుద్ధంగా పవన్.. టీడీపీతో జనసేన పొత్తుకు సంకేతాలు ఇచ్చేశాడు.
ఐతే ఇలా చంద్రబాబు, పవన్ కలిశారో లేదో.. అలా వైసీపీ తన గేమ్‌ను మొదలుపెట్టేసింది. పొత్తు పొడవకుండా ఏమేం చేయాలో అన్నీ చేయడానికి ఆ పార్టీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగినట్లే కనిపిస్తోంది. జనసేన కార్యకర్తలు, మద్దతుదారులను ప్రధానంగా వైసీపీ టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ ప్యాకేజీ స్టార్ అనడానికి, చంద్రబాబుకు దత్తపుత్రుడు అనడానికి ఇదే నిదర్శనమని.. ఎన్నాళ్లూ పవన్ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతాడని, ఆయనకు బానిసలా ఉంటాడని ఎమోషనల్‌గా జనసైనికులను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు.
మీరు మళ్లీ టీడీపీ జెండా మోయాల్సిందే.. సొంతంగా మీరు ఎదగలేరు.. అధికారంలోకి రాలేరు.. ఎవరినో అధికారంలోకి తేవడానికి మీరు కష్టపడడం ఏంటి అంటూ జనసైనికులను ఉడికించే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతోంది. ఇలా అదే పనిగా వాళ్లను టార్గెట్ చేస్తే పొత్తు వద్దంటూ తమ అధినేత దగ్గర అడ్డం పడతారని ఆశ కావచ్చు. చంద్రబాబు సొంతంగా గెలవలేడు, పవన్ కాళ్లు పట్టుకున్నాడు అంటూ తెలుగుదేశం కార్యకర్తల్ని సైతం ఇలాగే రెచ్చగొట్టి పొత్తు ప్రయత్నాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియను వైసీపీ చాలా గట్టిగానే చేస్తోంది. మరి వీరి ట్రాప్‌లో జనసేన, టీడీపీ ఎంత వరకు పడతాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates