ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ నోవాటెల్ హోటల్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. చంద్రబాబుతో పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ, వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా సంయుక్త కార్యాచరణపై దృష్టి పెట్టారు.
పవన్ కల్యాణ్ మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ముగించుకుని నేరుగా నోవాటెల్ హోటల్‌కు వచ్చారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి నేరుగా హోటల్‌కు చేరుకోగానే పవన్, నాగబాబు, నాదెండ్ల ఆయన సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది. అలాగే పొత్తు దిశగా చంద్రబాబు – పవన్ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.
నేటి నుంచి రాజకీయ ముఖచిత్రం మారుతుందని.. బీజేపీకి ఊడిగం చేయాల్సిన అవసరం లేదని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఇరువురు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత రాత్రి చంద్రబాబుతో పవన్ ఫోన్‌లో మాట్లాడారు. ఐదేళ్ల తరువాత తొలిసారి చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు.