జగన్‌కు పవన్ థ్యాంక్స్ చెప్పాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏదో ఒక వివాదాన్ని కొని తెచ్చుకోని, ఎంతో కొంత చెడ్డ పేరు సంపాదించని రోజంటూ ఉండట్లేదు ఈ మధ్య. ప్రతిపక్షంలో ఉండగా రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించి.. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. మూడేళ్ల పాటు రాజధాని విషయమై అసలేమీ చేయకపోవడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది జగన్ సర్కారు.
తాజాగా విశాఖ గర్జన పేరుతో వైసీపీ చేపట్టిన కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. కాలేజీ విద్యార్థులను, డ్వాక్రా మహిళలను ఈ కార్యక్రమానికి తరలించి ఎంత హంగామా చేద్దామని చూసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక ఆ కార్యక్రమం జరిగే రోజే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవాణి కార్యక్రమం కోసం జనసేనాని విశాఖకు వస్తే.. ఆయన ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏదో రకంగా పోలీసులు, అధికారులు ఇబ్బంది పెడుతూ వచ్చారు.

పవన్‌ను ఎలాగోలా నియంత్రించాలని చూస్తే.. అది కాస్తా బెడిసికొట్టి ఆయన హీరో అయిపోతున్నాడు. పవన్‌ను తన మానాన తనను వదిలేస్తే.. ఒక రోడ్ షో చేసుకుని, ఆ తర్వాత జనవాణి కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయేవాడు. కానీ పవన్ వచ్చే దారుల్లో లైట్లు ఆపించేయడం, ఆయన అభిమానులకు అభివాదం కూడా చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో మీడియాలో ఈ విషయం బాగా హైలైట్ అయింది. లైట్లు ఆగిపోతే అభిమానులు సెల్ ఫోన్ లైట్లతో వెలుగునివ్వడంతో ఆ విషయం హాట్ టాపిక్ అయింది. అద్భుతమైన విజువల్స్ జనసేనకు దొరికాయి. ఇక రోడ్ షోలో పోలీసులు చేసిన ఓవరాక్షన్ వల్ల కూడా అది వార్తాంశంగా మారింది.

ఇక పవన్‌ను హోటల్లోనియంత్రించడం, జనసేన నాయకులను అరెస్ట్ చేయడంతో వ్యవహారం రంజుగా మారింది. దీని వల్ల విశాఖ గర్జన కార్యక్రమం గురించి అసలు చర్చే లేకుండా పోయింది. పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్ దగ్గర వందల సంఖ్యలో పోలీసులను మోహరించడం.. పవన్‌కు నోటీసులివ్వడం.. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రాత్రంతా చేసిన హంగామా వల్ల రాష్ట్ర రాజకీయం అంతా పవన్ చుట్టూ తిరుగుతోంది రెండు రోజులుగా. మొత్తానికి చూస్తే పవన్‌ను నియంత్రించబోయి అతణ్ని పెద్ద హీరోను చేసిన ఘనత జగన్ సర్కారుకే దక్కుతుందనడంలో సందేహం లేదు. ఇందుకు జనసేనాని జగన్‌కు థ్యాంక్స్ చెప్పాల్సిందే.