ఎవరితో అయినా రెడీ..కండీషన్స్ అప్లై

సీపీఐ జాతీయ కార్యదర్శి కంకణాల నారాయణ ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. అదేమిటయ్యా అంటే మతోన్మాద పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఏ పార్టీతో అయినా సరే జతకడతారట. బీజేపీని ఓడించటమే లక్ష్యంగా ఏ పార్టీతో అయినా కలిసిపనిచేయటానికి తమకు అభ్యంతరం లేదన్నారు. ఇక్కడే నారాయణ ప్రకటన చాలా విచిత్రంగా ఉంది. ఏపార్టీతో అయినా సరే జతకడతామని ప్రకటించటం అంతా అబద్ధమని ఎప్పుడో తేలిపోయింది.

ఎందుకంటే సాటి వామపక్ష పార్టీ సీపీఎంతోనే సీపీఐకి పడదు. ఏ ఎన్నికలోను చిత్తశుద్దితో రెండుపార్టీలు కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. అసలు దేశంలో కమ్యూనిజమే అవసాన దశలో ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే కమ్యూనిస్టుపార్టీల పరిస్ధితి ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న రోగి పరిస్ధితిలాగ తయారైంది. ఒకపుడు పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో సీపీఎంకు తిరుగుండేది కాదు. అలాంటిది రెండు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది.

ఇక కేరళలో ఒకసారి అధికారంలో ఉంటే మరోసారి ప్రతిపక్షంలో కూర్చుంటోంది. అయినా పర్వాలేదు బలంగానే ఉందని అనుకోవాలి. అయితే పై మూడు రాష్ట్రాల్లోను సీపీఎం బలంగా ఉందేకానీ సీపీఐ కాదు. ఈరోజు పరిస్ధితి అయితే కేరళలో తప్ప ఇంకెక్కడా సీపీఎం కూడా అధికారంలో కాదు బలంగా కూడా లేదు. సో దేశం మొత్తంమీద వామపక్షాలు ఎక్కడైనా ఉందంటే అది కేరళలో తప్ప ఇంకెక్కడా లేదు. ఇక తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో అసలు వామపక్షాలను పట్టించుకునే వాళ్ళు లేరు.

తెలంగాణాలో నల్గొండ, ఖమ్మ జిల్లాల్లో ఒకపుడు బలంగానే ఉన్నప్పటికీ ఇపుడు ఈ జిల్లాల్లో కూడా ఏదో ఉందంటే ఉందంతే. సీపీఐ-సీపీఎంలు కలిసిపోవాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రతిపాదనలు వస్తున్నాయి పోతున్నాయి. ఏకంకాకపోయినా పర్వాలేదు చిత్తశుద్దితో పొత్తుపెట్టుకుంటున్నాయా ? ఒకవేళ పొత్తు పెట్టుకున్నా ఒకదాన్ని ఓడించేందుకు మరోపార్టీ ప్రయత్నిస్తునే ఉంటుంది. ఒకపార్టీకి మరోపార్టీ వెన్నుపోటు పొడుచుకోవటం వల్లే వామపక్షాల పరిస్దితి ఇంత దయనీయంగా తయారైంది. ఇంతోటిదానికి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరితో అయినా కలుస్తామని నారాయణ చెప్పటమే విచిత్రంగా ఉంది.