ఓపెనింగ్ అదిరిందా ?

భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీలోకి ఎంట్రీ అదిరిపోయింది. కర్నాటకలో నుండి ఏపీలోని అనంతపురం జిల్లాలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించింది. జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో డీ హిరేహాల్ మండలంలోని జాజరకల్లు గ్రామంలోకి రాహుల్ పాదయాత్రతో ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ ను స్వాగతించేందుకు నేతలు, శ్రేణులు భారీఎత్తున పోటీపడ్డారు. పార్టీ నేతలు, శ్రేణులు కాబట్టి పోటీపడ్డారంటే అర్ధముంది. కానీ మామూలు జనాలు కూడా రాహుల్ ను చూడటం కోసం ఎగబడటమే ఆశ్చర్యంగా ఉంది.

శుక్రవారం ఉదయం 10 గంటలకు జాజర కల్లు గ్రామంలోకి రాహుల్ వస్తున్నారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని జనాలు గ్రామం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. రాహుల్ కు స్వాగతం పలుకుతూ పార్టీ నేతలు వేలాది పోస్టర్లు, బ్యానర్లు కట్టారు. రాహుల్ వచ్చిన సమయంలో ఏదో పెద్ద ఉత్సవం జరుగుతున్న వాతావరణం కనిపించింది. దాదాపు మూడున్నర సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తన మద్దతుదారులతో రాహుల్ ను రిసీవ్ చేసుకోవటం విశేషమనే చెప్పాలి.

అగ్రనేతను రిసీవ్ చేసుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ తదితరులు పోటీపడ్డారు. ఏదేమైనా రాహుల్ పాదయాత్ర చాలా సంవత్సరాల తర్వాత పార్టీ నేతలు, శ్రేణుల్లో ఒకరకమైన ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. హీరేహల్ మండల కేంద్రంలో భారీ ఎత్తున జనాలు చేరారు. అయితే వీరంతా బాగా నీరసపడిపోయారు. ఎందుకంటే రాహుల్ రోడ్డుషో లేదా సభలో మాట్లాడుతారని జనాలంతా అనుకున్నారు.

అయితే జనాలు ఆశించినట్లుగా రాహుల్ ఏమీ మాట్లాడలేదు. పాదయాత్రలో అందరికీ నమస్కారం చేస్తు, చేతులు ఊపుతు అభివాదాలు చేసుకుంటు వెళిపోయారు. నిజానికి రాహుల్ మాట్లాడుతారని నేతలు కూడా ఎవరు చెప్పలేదు. మండల కేంద్రంలో రాహుల్ మాట్లాడటమన్నది డైలీ ప్రోగ్రామ్ లో లేదు కాబట్టి ఆయన మాట్లాడలేదంతే. ఏదేమైనా పార్టీ నేతల్లో మాత్రం రాహుల్ పాదయాత్ర మంచి ఊపునిచ్చింది వాస్తవం.