పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు నమోదయ్యే వందలు కాస్తా పదిహేనువందలకు చేరుకున్నపరిస్థితి. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ పుణ్యమా అని.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వీయ లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. పలు వాణిజ్య సంస్థలు తమకు తాముగా స్వీయ నియంత్రణ విధించుకొని షాపుల్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమవుతుందన్న వాదన జోరుగా వినిపించింది.
అందరి అంచనాల్ని వమ్ము చేస్తూ.. తెలంగాణలో అందునా హైదరాబాద్ మహానగరంలో లాక్ డౌన్ విధించే అవకాశం లేదన్న విషయం కాస్త ఆలస్యంగా అర్థమైంది. ఎందుకిలా? కేసులు పెరిగిపోతున్న వేళ.. వాటిని నియంత్రించాల్సింది పోయి.. లాక్ డౌన్ ఎందుకు విధించటం లేదన్నది ప్రశ్నగా మారింది. ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీకి చెందిన వారెవరూ దీనికి సూటిగా సమాధానం చెప్పింది లేదు.
ఇలాంటివేళ.. మంత్రి కేటీఆర్ అన్యాపదేశంగా హైదరాబాద్ లో లాక్ డౌన్ ఎందుకు విధించటం లేదన్న విషయంపై క్లారిటీ ఇచచేశారు. గణాంకాల్ని గమ్మత్తుగా చెప్పేసిన కేటీఆర్.. జాతీయ సగటుతో పోలిస్తే.. తెలంగాణలో మరణాలు తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మూడు శాతం మరణాల రేటు ఉంటే.. తెలంగాణలో మాత్రం రెండు శాతమే ఉందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యలతోనే అది సాధ్యమైందనన ఆయన.. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ వచ్చే వరకూ లాక్ డౌన్ విధించి ఇళ్లల్లోనే ఉంచలేని పరిస్థితి ఉందన్న మంత్రి కేటీఆర్.. వైరస్ వల్ల ఎంతమంది చనిపోతారో తెలీదు కానీ.. ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో కూడా తెలీని పరిస్థితి ఉందన్నారు. మళ్లీ లాక్ డౌన్ విధిస్తు ప్రజలు ఉపాధి కోల్పోతారని చెప్పారు. అందుకే.. అందరికి జీవితం.. జీవనోపాధి చాలా ముఖ్యమని.. కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి.. డెవలప్ మెంట్ సాధించాలన్నారు. ఈ మాటల్ని చూస్తే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉన్నా లాక్ డౌన్ విధించే అవకాశం లేదన్న విషయం మంత్రి కేటీఆర్ మాటలతో స్పష్టమైందని చెప్పక తప్పదు.