కరోనాపై అవగాహన పెంచి.. చివరికి కరోనాకే బలై

కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులే చివరికి ఆ వైరస్ బారిన పడి ప్రాణాలు వదులుతున్న విషాదాంతాలూ చూస్తున్నాం. కరోనాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పిన వాళ్లు సైతం చివరికి ఆ వైరస్ బాధితులుగా మారుతున్నారు. తాజాగా అలా కరోనా బాధితుడిగా మారిన ఓ రచయిత, గాయకుడు ప్రాణాలు వదిలిన విషాదాంతం హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది. సామాజిక అంశాల మీద గద్దర్ తరహాలో పాటలు రాసి, పాడటం ద్వారా నయా గద్దర్‌గా పేరు తెచ్చుకున్న సుద్దాల నిస్సార్ కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేత. ప్రజానాట్య మండలి కార్యదర్శిగానూ సేవలందించారు. అనేకసార్లు సామాజిక అంశాలపై తన గళం వినిపించిన నిస్సార్..‌ కరోనా మహమ్మారి మీదా ఓ పాట రాశారు. స్వయంగా పాడి ప్రజలకు అవగాహన కల్పించారు.

అద్దె గట్టామాయె.. అప్పు పెరిగిపాయె.. వచ్చిన జీతమూ వడ్డీలకే పాయె.. చిట్టి గట్టామాయె.. ఉట్టి చేతులాయె.. పిల్లలా ఫీజుల ఫిగర్‌ పెరిగిపాయె.. కంపెనీ బందాయె.. ఇల్లు గడవదాయె.. కడుపు నింపేదెట్లరన్నో.. రెక్కాడితే గానీ డొక్కాడనోళ్లము.. దిక్కులేకుంటతైమిరన్నా.. పెట్టుకున్నా పెండ్లి ఆగిపోయే.. దూరమున్న కొడుకు దరికి చేరడాయె..ఇంట్లెవరు చచ్చినా ఇరుగుపొరుగు రారు.. కడసూపు నోచని కన్నీటి గాథలు’ అంటూ కరోనాతో తల్లకిందులైన జీవితాల గురించి ఆయన చాలా ప్రభావవంతంగా రాశారు. అంతే కాక ‘కరోనా రోగంతో ముందు జాగ్రత్తలే కాపాడే మందూలోరన్నా..వ్యాక్సినొచ్చేదాకా మాస్క్‌ పెట్టుకోని మందితో దూరంముండన్నా.. నవ్వు మందితో దూరముండన్నా..’ అంటూ జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నమూ చేశారు. కానీ చివరికి కరోనా ఆయన్నే కబళించింది. కొన్ని వారాల కిందట కరోనా బారిన పడ్డ నిస్సార్.. కొన్ని రోజులు బాగానే ఉన్నా, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. మెరుగైన చికిత్స కోసం ఆయన అనేక ఆస్పత్రులు తిరిగారని.. చివరికి గాంధీలో చేరితే పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. కరోనా మీద అందరికీ అవగాహన కల్పించి.. చివరికి దానికే నిస్సార్ బలికావడం విషాదం.