దేశంలోని ప్రతిపక్షాల నేతలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసిందంటే చాలు దానివెనుక బీజేపీ హస్తముందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకంటే ఇప్పటివరకు జరిగిందిదే కాబట్టి. ఇప్పుడిదంతా ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ విచారించింది కాబట్టే. హైదరాబాద్ లో ఈడీ అధికారులు జేసీని సుమారు 8 గంటల పాటు విచారించారు.
అశోక్ లేల్యాండ్ నుండి 126 బస్సుల స్క్రాప్ కొనుగోలు వ్యవహారంలో జేసీ మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారనేది ఈడీ ఉన్నతాధికారుల అనుమానం. మరిది అనుమానమేనా లేకపోతే నిజముందా అన్నది తెలీటంలేదు. విచారణ తర్వాత మీడియాతో జేసీ మాట్లాడుతూ స్క్రాప్ కొనుగోలులో మనీ ల్యాండరింగ్ ఏమీ జరగలేదని తాను సమాధానమిచ్చినట్లు చెప్పారు. అంటే మనీల్యాండరింగ్ వ్యవహారంపై విచారణ జరిగినట్లు అర్ధమవుతోంది.
స్క్రాప్ కొనుగోలు సందర్భంగా కొన్నిపత్రాలపై జేసీ పెట్టిన సంతకాలు ఫోర్జరీ అనే ఆరోపణల విచారణకు ఈడీ రావాల్సిన అవసరంలేదు. ఎవరి సంతకాలనో జేసీ ఫోర్జరీ చేశారనో లేకపోతే చేయించారనో ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈడీ జరిపిన విచారణ అంతా మనీ ల్యాండరింగ్ వ్యవహారంలోనే అని తేలిపోయింది. ఎప్పటినుండో ఆరోపణలున్నా సరిగ్గా ఇప్పుడే ఈడీ ఎందుకు సీన్లోకి ఎంటరైంది ? ఎందుకంటే జేసీలపై ఒత్తిడి పెట్టి లొంగదీసుకోవటమే వ్యూహంగా కనబడుతోందనే ఆరోపణలు మొదలయ్యాయి.
జేసీ బ్రదర్స్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతున్నది. అయితే ఆ విషయమై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతలో కేసీయార్ ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ లో జేసీలు చేరబోతున్నట్లు ప్రచారం మొదలైంది. జేసీలపై ఒత్తిడిపెట్టి తమపార్టీలోకి లాక్కోవాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీయే వెనకనుండి ఈడీతో దాడులు చేయిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరక నిజమో తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates